కేరళ శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనం రోజుకి 80000

కేరళ శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనం రోజుకి 80000

జనం న్యూస్ 06 మే 2024 కేరళలో శబరిమల అయ్యప్ప ఆలయం దేశంలోనే ఎంతో ప్రసిద్ధిచెందిన ఆలయం. ఇక్కడికి ఏటా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ సారి స్వామివారి దర్శానికి వెళ్లే భక్తులకు ఓ ముఖ్యగమనిక..*

స్పాట్ బుకింగ్‌లను రద్దుచేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. వర్చువల్‌ క్యూ బుకింగ్‌ చేసుకున్నవారినే దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రోజుకి కేవలం 80,000 మంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి కల్పించేలా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో మకరవిళక్కు పూజలు జరుగుతాయి. ఈ పూజల సందర్భంగా ఆలయం రెండు నెలల పాటు తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో అయ్యప్ప భక్తులంతా 41 రోజుల పాటు మాలను ధరించి, స్వామివారి దర్శనార్థం ఇక్కడికి విచ్చేస్తారు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

శబరిమల ఆలయంలో జరిగే పూజలు రెండు మాసాల పాటు జరుగుతాయి. ఈ పూజలు ప్రతి ఏటా నవంబరు మూడో వారం నుంచి జనవరి మూడో వారం వరకు జరుగుతాయి. ఈ పూజల సందర్భంగా ఆలయం ఈ 2 నెలల పాటు ఆలయం తెరిచి ఉంటుంది. గత సారి జరిగిన పూజల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి అలా జరగకూడదని, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ముందుగానే మేల్కొంది. ఈ సారి జరగబోయే మండల, మకరువిళక్కు సీజన్‌ కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. శబరిమలలో అమలవుతోన్న స్పాట్‌ బుకింగ్‌లను రద్దు చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్‌ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శబరిమలకు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం తెలిపింది.

ఈ ఏడాది నవంబరు 15 నుంచి మకరువిళక్కు పూజలు..

అయితే, గతంలో పది రోజుల ముందు మాత్రమే టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ దానిని తాజాగా, మూడు నెలల ముందు వరకు పెంచినట్లు దేవస్థానం తెలిపింది. ఈ ఏడాది నవంబరు 15 నుంచి మండల, మకరువిళక్కు పూజలు ప్రారంభమవుతాయి. జనవరి 14, 2025న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఇందుకోసం కేవలం వర్చువల్‌ క్యూ బుకింగ్‌ చేసుకున్నవారినే దర్శనానికి అనుమతించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ బుకింగ్ ద్వారా దర్శనానికి రోజుకు కేవలం 80,000 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది.