విజయనగరం పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం కేటాయించాలని కోరుతూ సంతకాల సేకరణ
జనం న్యూస్ 20 అక్టోబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం కేటాయించాలని కోరుతూ విద్యార్థుల దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు డి రాము , సిహెచ్ వెంకటేశ్ మాట్లాడుతూ 2019లో ఎస్ఎఫ్ఐ ఆందోళన ఫలితంగా ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని విమర్శించారు. కళాశాల ఏర్పడి ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు కనీసం ఈ కళాశాలకు సొంత భవనం కేటాయించకపోవడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి అని తెలిపారు. దాదాపుగా ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 400 మంది విద్యార్థులు వివిధ కోర్సులలో విద్యను అభ్యసిస్తున్నారని అయినా విద్యార్థుల సంఖ్య కి అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో క్లాసులు సరిగా జరగక సిలబస్ పూర్తవక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. విద్యార్థులందరికీ సరిపడా తరగతి గదిలు లేకపోవడంతో ఒక పూట మాత్రమే క్లాసులు నిర్వహిస్తున్నారని దీనివలన పూర్తిస్థాయిలో పాఠాలు చెప్పలేని పరిస్థితుల్లో అధ్యాపకులు వినలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఏర్పాటు చేయని సొంత భవనాన్ని ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వమైన సానుకూలంగా స్పందించి సొంత భవనాన్ని నిర్మాణం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ విద్యార్థులు సంతకాల రూపంలో తమ ఆవేదనను తెలియజేశారు. ప్రభుత్వం ఈ హామీకి స్పందించని ఎడల భవిష్యత్తులో విద్యార్థులను , తల్లిదండ్రులను , అధ్యాపకులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని దీనికి రాష్ట్ర విద్యా యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సంతకాల ప్రతులను త్వరలోనే జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు ఎర్రమ్మ , రాహుల్ ,సూరిబాబు , మురళి తదితరులు పాల్గొన్నారు.