తెలంగాణలో దారుణం. చేతబడి చేస్తున్నారని ముగ్గురిపై దాడి.. అక్కడికక్కడే ఒకరు మృతి.

తెలంగాణలో దారుణం. చేతబడి చేస్తున్నారని ముగ్గురిపై దాడి.. అక్కడికక్కడే ఒకరు మృతి.

జనం న్యూస్: మంత్రాల నెపంతో.. క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ ముగ్గురి పై దాడి చేయడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాలోని టేక్మాల్ మండలంలోని గొల్లగూడెంలో ఈ ఘటన మంగళవారం కలకలం రేపింది. కొల్చారం మండలం ఏటిగడ్డ మందాపూర్ కు చెందిన రాములు (58), నిజాంపెట్ మండలం బాచేపల్లికి చెందిన బాలమణిలు గత రెండు రోజుల క్రితం సమీప బంధువు గోల్లగూడెంకు చెందిన బురుజు కింది గంగవ్వ వద్దకు వచ్చారు. గ్రామంలో అక్కడక్కడ నిమ్మకాయలు పెట్టారని స్థానికులు ఆరోపించారు. గంగవ్వ ఇంటి పక్క సమీపంలో నిమ్మకాయలు పెట్టడం, సోమవారం అమావాస్య కావడంతో వారిని స్థానికులు నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గంగవ్వ ఇంట్లో ఉన్న ముగ్గురిని బయటకు లాక్కొచ్చి చితకబాదారు. దీంతో రాములు అక్కడికక్కడే మృతిచెందగా గంగవ్వ, బాలమణిలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అల్లాదుర్గం సీఐ రేణుకా సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, గాయపడిన వారిని అదే ఆసుపత్రికి తరలించారు. 

డీఎస్పీ సందర్శన.. 

బాణామతి చేస్తున్నారన్న నెపంతో ముగ్గురి పై దాడి చేసి, ఒకరు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ ప్రసన్నకుమార్ మంగళవారం గొల్లగూడెం సందర్శించారు. దాడి ఎవరు చేశారు, ఏలా జరిగిందన్న విషయాన్ని చుట్టుపక్కల ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. మంత్రాల నెపంతో దాడులు చేయడం సరికాదన్నారు. ప్రజలెవ్వరు ఇలాంటివి నమ్మకూడదని, ఏమైనా అనుమానం, సందేహాలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలే తప్ప, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని ఆయన సూచించారు. ఈ ఘటనలో వ్యక్తి చావుకు కారణమైన వారి వివరాలను సేకరించి కేసులు నమోదు చేయాలని సీఐ రేణుకను ఆదేశించారు.