ఎగిరే విమానంలో ఇవేం పనులు ఆంటీ..! దేనికైనా ఒక హద్దు ఉండాలి.. (వీడియో చూడండి)

జనం న్యూస్: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేయడం అనేది ఈరోజుల్లో అందరికీ ఒక దినచర్యగా మారిపోయింది. అసలు రీల్స్ చేయకపోతే ఊపిరి తీసుకోలేమన్నంతగా.. వాటి మోజులో పడ్డారు. ఇలా రీల్స్ చేసుకోవడంలో తప్పు లేదు కానీ.. కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ.. ఇతరుల ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. తమ వల్ల ఇతరులకి ఇబ్బంది కలుగుతోందన్న ఇంకితజ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఆంటీ కూడా ఇలాగే హద్దుమీరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఒక మహిళ ఇండిగో విమానంలో ప్రయాణించింది. అయితే.. ఇతర ప్రయాణికుల మాదిరి తన సీటులో కూర్చోకుండా, ఆమె ఓ ఘనకార్యం చేసింది. విమానం గాల్లో ఉన్నప్పుడు.. తన ఇన్‌స్టాగ్రామ్ కోసం ఒక వీడియో చేసింది. ఆమె ఇన్‌స్టా ఐడీ 'సల్మా షేక్' పేరుతో ఉంది. అటు ఇటు ప్రయాణికులు తమ సీట్లలో కూర్చొని ఉండగా.. వారి మధ్య ఆమె 'స్టైల్ స్టైల్' అనే పాటకు డాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి నాన్‌సెన్స్ చేయడానికి అదేమీ ఆమె ప్రైవేట్ విమానం కాదని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అని మండిపడుతున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడటాన్ని ఆ వీడియోలో చూడొచ్చని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ రీల్‌పై కామెంట్ చేస్తూ.. ''ఇదొక చెత్త వీడియో. తను నలుగురి మధ్య ఇలాంటి వీడియో చేసిందని అభినందించాలా? లేకపోతే తాను ఎంపిక చేసిన చెత్త రీల్‌పై సెటైర్ వేయాలా?'' అంటూ రాసుకొచ్చాడు. ఇంకొకరేమో.. 'ఇదేం నీ ఇల్లు కాదు, ఇలాంటి న్యూసెన్స్ ఆపండి' అంటూ నిప్పులు చెరిగాడు. ''ఇన్నాళ్లూ ట్రాఫిక్ సిగ్నల్స్, రైళ్లలో మాత్రమే ఇటువంటి చెత్త చూసేవాడినని.. ఇప్పుడు ఇది విమానాల దాకా చేరిందా?'' అంటూ ఇంకొక నెటిజన్ నిట్టూర్చాడు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. మరి.. ఇండిగో ఏమైనా చర్యలు తీసుకుంటుందా? లేదా? చూడాలి.