మాదక ద్రవ్యాల మత్తును "సంకల్పం"తో తరిమేద్దాం
- విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టీ, ఐపిఎస్
జనం న్యూస్ 20 సెప్టెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు "సంకల్పం" కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
"బీ స్మార్ట్ - డోస్ట్ స్టార్ట్" అంటూ విద్యార్థులకు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన జిల్లా పోలీసులు
డ్రగ్స్ నుండి బయపడేందుకు కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ
జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో "సంకల్పం" కార్యక్రమ నిర్వహించి, విద్యార్దులకు అవగాహన కల్పిస్తామన్న జిల్లా ఎస్పీ
డ్రగ్స్ గురించిన సమాచారాన్ని అందించేందుకు కళాశాలలో 'డ్రాప్ బాక్సులు' ఏర్పాటు చేసిన పోలీసుశాఖ మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి, వారిని చైతన్యపర్చి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సంకల్పం" కార్యక్రమాన్ని సెప్టెంబరు 19న భోగాపురం మండలం మిరాకిల్ ఇంజనీరింగు కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ డిఐజి శ్రీ గోపినాథ్ జెట్టి, ఐపిఎస్ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డివిజి గోపీనాథ్ అట్టి మాట్లాడుతూ - యువతను మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండాను, అలవాటు నుండి దూరం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు జిల్లా పోలిసు శాఖ 'సంకల్పం' కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు రూపొందించిన 100రోజుల ప్రణాళికలో భాగంగా పోలీసుశాఖ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతీరోజూ చర్యలు చేపడుతుందన్నారు. గతంలో కంటే మాదక ద్రవ్యాల వినియోగం వేగంగా పెరుగుతున్నట్లుగా సర్వేలు తెలుపుతున్నాయన్నారు. దేశం అభివృద్ధి చెందే క్రమంలో ప్రజల ఆదాయం పెరగడంతోపాటు, అలవాట్లు కూడా రోజురోజుకు మారుతున్నాయన్నారు. ఇందులో భాగంగా వ్యసనాలకు డబ్బులు ఖర్చు చేస్తూ, మద్యం, మత్తు కలిగించే వాటిపట్ల ఆకర్షితులవుతూ ప్రక్క దారి పడుతున్నారన్నారు. కొన్ని డ్రగ్స్ ను న్యాయబద్ధంగా తయారుచేస్తూ, వైద్యంలో వినియోగిస్తుంటే, మరికొన్ని రకాల మత్తు కలిగించే గంజాయి, నల్లమందు పంటలను అక్రమంగా పండిస్తున్నారన్నారు.ఇటీవల కాలంలో 10వేల ఎకరాల్లో గంజాయి పంటను నాశనం చేసి, 3000 మందిని అరెస్టు చేసామన్నారు. గంజాయి పండించే రైతుల జీవనోపాధికి పెద్ద పీట వేస్తూ, ప్రత్యామ్నాయ పంటలను పండించేందుకు విత్తనాలను ఉచితంగా ఏజన్సీ ప్రాంతాల్లో గత రెండు మాసాల్లో అందించామన్నారు. మాదక ద్రవ్యాలకు నియంత్రణకు అరెస్టుల కంటే అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం అన్నది ఒకరి సమస్య కాడని, సమస్య ప్రతీ ఒక్కరదని, సమాజానిదని, వాటిని నియంత్రించే బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయడం, మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారిని వాటిని బయటపడేందుకు వారికి సహాయపడడం, అక్రమంగా మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న కలిగివున్న, విక్రయిస్తున్న వారి సమాచారాన్ని పోలీసువారికి అందించాలన్నారు. యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండే విధంగా ప్రతీ ఒక్కరూ చేయిచేయి కలిపి పని చేయాల్సిన అవసరం ఉందని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టీ అన్నారు.
నెల్లిమర్ల ఎమ్మేల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం వలన చాలా కుటుంబాలు, యువత నాశనమవుతున్నారన్నారు. సమాజానికి హాని కలిగించే మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేస్తున్నాయన్నారు. జిల్లా పోలీసుశాఖ యువతలో చైతన్యం తీసుకొని వచ్చేందుకు మంచి ఉద్ధేశ్యంతో 'సంకల్పం' కార్యక్రమంను చేపట్టడం అభినందనీయమన్నారు. సాంకేతికతను మాదక ద్రవ్యాల నియంత్రణకు వినియోగించి, సత్ఫలితాలు సాధించాల్సిన అవసరముందని ఎమ్మేల్యే లోకం నాగమాధవి అన్నారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణ అన్నది నేడు సమాజం ఎదుర్కొంటున్న పెద్ద ఛాలెంజ్ అని అన్నారు. ప్రస్తుతం మారుమూల గ్రామాల్లో సైతం గంజాయి వినియోగం పెరిగిపోయిందన్నారు. మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు అరెస్టులు చేపట్చేకంటే అవగాహన కల్పించడంతోనే నిర్మూలించ వచ్చునని భావించి యువతలో చైతన్యం తీసుకొని వచ్చి, వారిని మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు, వాటి అలవాటు నుండి బయటపడేందుకు 'సంకల్పం' కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విద్యార్థులు ఒకసారి డ్రగ్స్ ను వినియోగిస్తే ఏమీ కాదన్న భ్రమలో ఉంటారని, కాని డ్రగ్స్ ఒకసారి వినియోగించడం వలన త్వరితగతిన వాటికి బానిసలుగా మారుతారన్న వాస్తవాన్ని విద్యార్ధి దశలో ఉన్నప్పుడు గ్రహించలేరన్నారు. డ్రగ్స్ కు బానినలుగా మారిన యువత వారి అలవాట్లుకు సరిపడే డబ్బులు లేక చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడి నేరస్థులుగా మారుతున్నారన్నారు.నేరస్థులుగా మారిన వారిపై పోలీసు నిఘా ఉంటుందని, వారు ఏ ఉద్యోగంలో చేరినా, విదేశాలకు వెళ్ళాలనుకున్నా పోలీసు వెరిఫికేషనులో వారి నేరచరిత బయటపడుతుందని, తద్వారా ఉపాధి, అవకాశాలు కోల్పోతారన్నారు. అంతేకాకుడా, గంజాయి కేసుల్లో నిందితులుగా పట్టుబడితే 20 సం.లు వరకు జైలుశిక్ష పడే అవకాశం కూడా ఉందన్నారు. కావున, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండాలని, ఒకవేళ అలవాటు పడిన వారెవరైనా ఉంటే ఎటువంటి సంకోచం లేకుండా డీ అడిక్షన్ సెంటరులో ప్రాధమిక స్థాయిలో చికిత్స పొందితే, వాటి నుండి బయటపడ వచ్చునని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.మిరాకిల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, మిరాకిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సిఈఓ లోకం ప్రసాదరావు, ప్రభుత్వ సైక్రియాటీ హెచ్.ఓ.డి. డా॥ మల్లిక విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను తెలియపరుస్తూ జిల్లా పోలీసుశాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషను, ప్రదర్శించిన వీడియోలు విద్యార్థులను ఎంతగానో ఆలోచింపజేసాయి. మాదక ద్రవ్యాలను నియంత్రించుటలో భాగంగా మిరాకిల్ ఇంజనీరింగు కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం, స్థానిక ఇన్స్ పెక్టరు వారితో యాంటీ డ్రగ్స్ కమిటీని ఏర్పాటు చేసారు. మాదక ద్రవ్యాలపై యువతకు, విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్‌ను విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టీ ఆవిష్కరించారు. డ్రగ్స్ పట్ల విద్యార్థులకు అవగాహన ఎంత వరకు ఉందో తెలుసుకొనేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన క్వచ్చన్ పేపరును విద్యార్ధులకు అందజేసి, జవాబులు రాబట్టారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, తమ చుట్టూ ఉన్న వారిని కూడా మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని, ఏదైనా సమస్య ఉంటే యాంటీ డ్రగ్ కమిటీ దృష్టికి తీసుకొని వెళ్ళాలని కోరారు. విద్యార్థులతో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల విద్యార్థులను డ్రగ్స్ వినియోగం, కలిగివున్న వారి సమాచారంను అందించేందుకు కళాశాల్లో డ్రాప్ బాక్సు లను జిల్లా పోలీసులు ఏర్పాటు చేసారు. అదే విధంగా డ్రగ్స్ కి అలవాటుపడిన విద్యార్ధులను వాటి నుండి బయట పడేందుకు సహాయాన్ని అందించేందుకు యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం, డిఐజి గోపీనాథ్ జట్టీ గారు మిరాకల్ ఇంజనీరింగు కళాశాలకు డ్రగ్స్ పట్ల అవగాహన కలిగిన కళాశాల ధృవపరుస్తూ సర్టిఫికేటును కళాశాల అధినేత లోకం ప్రసాదరావు, ఎమ్మేల్యే లోకం నాగ మాధవి గార్లకుఅందజేసారు.ఈ కార్యక్రమంలో మిరాకిల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, మిరాకిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సిఈఓ లోకం ప్రసాదరావు, ప్రభుత్వ సైక్రియాటీ హెచ్.ఓ.డి. డా॥ మల్లిక, డిఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, మిరాకిల్ ఇంజనీరింగు కాలేజ్ డీన్ డా. బి.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డా. ఎ.అర్జునరావు, పలువురు సిఐలు, ఎస్ఐలు, మిరాకిల్ కళాశాల ప్రొఫెసర్స్, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.