500ల కోసం గొడవ.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు.. అసలేం జరిగింది..?

500ల కోసం గొడవ.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు.. అసలేం జరిగింది..?

జనం న్యూస్: మద్యం మహమ్మారి ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మందు తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా అతడి మృతిని తట్టుకోలేక భార్య కూడా సూసైడ్ చేసుకుంది. ఈ దుర్ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గుడివాడ పట్టణంలోని వాసవి నగర్ లో కొలుసు రాంబాబు, కనకదుర్గ దంపతులు కొడుకు గౌతమ్ తో కలిసి నివాసముండేవారు. అయితే మద్యానికి బానిసైన రాంబాబు ఎక్కడా కుదురుగా ఉద్యోగం చేయలేకపోయాడు. అనేక ఉద్యోగాలు మారి చివరకు ఏలూరులోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ లో బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల కుటుంబ అవసరాల కోసం రాంబాబు రూ.4 వేలు కొడుకు గౌతమ్ ఖాతాలో వేసాడు. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో తానిచ్చిన డబ్బులు తిరిగి తీసుకోసాగాడు. ఇలా కొడుకు వద్ద రెండువేలు తీసుకున్న రాంబాబు మరో రూ.500 కావాలని భార్యను అడిగాడు. తాగడానికి డబ్బులు ఇచ్చేందుకు భార్య నిరాకరించింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య తనను ఎదిరించి డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన రాంబాబు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడి మరణవార్తను భార్య కనకదుర్గ తట్టుకోలేకపోయింది. దీంతో ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలింది. కేవలం రూ.500 కోసం భార్యాభర్తల మద్య జరిగిన చిన్న గొడవ ఇద్దరినీ బలితీసుకుంది. రాంబాబు, కనకదుర్గ దంపతుల సూసైడ్స్ తో గుడివాడ వాసవి నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షణికావేశంలో ఈ దంపతులు తీసుకున్ని దారుణ నిర్ణయం ఒక్కగానొక్క కొడుకును ఒంటరవాన్ని చేసింది. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద అతడు కన్నీరుమున్నీరుగా విలపిస్తన్నాడు. రాంబాబు, కనకదుర్గ దంపతుల ఆత్మహత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గుడివాడ పోలీసులు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.