7సం.లకు పైబడి శిక్షలు విధించే కేసుల్లో నిందితుల వేలిముద్రలు సేకరించాలి
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.
జనం న్యూస్ 14 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., నవంబరు 13న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - నేరాల నియంత్రణకు షాపులు, వాణిజ్య సముదాయాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకొనే విధంగా ప్రజలను అధికారులు ప్రోత్సహించాలన్నారు. పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగే విధంగా చూడాలని, వారు స్టేషనుకు ఎందుకు వచ్చినది తెలుసుకొని, పరిష్కార మార్గాలను చూపాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. రాత్రి గస్తీ, పెట్రోలింగును మరింత పటిష్టవంతం చేయాలని, విధులకు వెళ్ళే ముందు వారు నిర్వహించాల్సిన విధుల గురించి అధికారులు బ్రీఫింగ్ చేయాలన్నారు. పోలీసు సిబ్బంది లాఠీలు, విజిల్ తమ వెంట తీసుకొని వెళ్ళాలని, వాహనాలకు సైరన్ అమర్చుకుని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు రాత్రి సమయాల్లో అనుమానస్పదంగా తిరిగే వ్యక్తుల వేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో తనిఖీ చేయాలన్నారు. రాత్రి11గంటల తరువాత అకారణంగా తిరిగే వ్యక్తులను స్టేషనుకు తరలించి, కౌన్సిలింగు నిర్వహించాలని, వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.
హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులను వారంలో ఒక రోజు స్టేషను పిలిపించి, వారి ప్రవర్తన, జీవనోపాధికి చేస్తున్న వృత్తుల గురించి ఆరా తీయాలని, నేరాలకు మళ్ళీ పాల్పడతారన్న అనుమానం ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టాలని, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తుల హిస్టరీ షీట్లును ఆయా స్టేషన్లుకు బదిలీ చేయాలన్నారు. పెండింగు నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేయాలని, అందుకు ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన ప్రాపర్టీని ప్రత్యేకమైన కార్డు బోర్డుల్లో భద్రపర్చాలని, అందుకు సంబంధించిన ప్రావర్టీ రిజిష్టరులో వివరాలను నమోదు చేయాలన్నారు. మరణించిన వ్యక్తుల మరణ ధృవీకరణ పత్రం తీసుకొని, ఆయా వ్యక్తుల హిస్టరీ షీట్లును మూసివేసేందుకు ప్రతిపాదనలను పంపాలన్నారు.
కేసుల నమోదు, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు సిసిటిఎన్ఎస్ లో నమోదు చేయాలన్నారు. 7సం.లకు పైబడి శిక్ష పడే అన్ని కేసుల్లో అరెస్టు కాబడిన నిందితుల వేలి ముద్రలను లైవ్ స్కానర్లలో తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో బెల్టు షాపుల నిర్వహించకుండా కఠినంగా వ్యవహరించాలని, అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణ జరగకుండా చూడాలన్నారు. దాబాల్లో మద్యం సరఫరా జరగకుండా చూడాలని, ఎవరైనా మద్యం సరఫరా చేస్తే వారిపై ఎన్ఫోర్సెమెంటు కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. డయల్ 112/100కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, గ్రామాల్లోను, పట్టణాల్లో పేకాట, కోడి పందాలు నిర్వహించకుండా చూడాలని, ముందస్తు సమాచారాన్ని సేకరించి, విస్తృతంగా దారులు నిర్వహించాలన్నారు.పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టమ్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై, నిర్ధిష్ట సమయంలోగా విచారణ పూర్తి చేసి, నివేదికలను పోలీసు కార్యాలయంకు పంపాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
డిసెంబరు 14న జరిగే లోక్ ఆధాలత్ లో ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా ఇప్పటి నుండే ప్రణాళికతోపని చేయాలన్నారు. మిస్సింగు కేసుల్లో అలసత్వం వద్దని, కేసు నమోదైన వెంటనే దర్యాప్తు ముమ్మరం చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, వారి ఆచూకీ కనుగొనాలన్నారు. ఎన్టీపీఎస్ కేసుల్లో గంజాయి విక్రయాలు జరిపి, పట్టుబడిన వారిపై సస్పెక్ట్ షీట్లును ఓపెన్ చేసి, వారిపై నిఘా పెట్టాలన్నారు. రహదారి భద్రతకు ఎన్ఫోర్సుమెంటు కేసులను పెంచాలని, ఎం.వి. నిబంధనలు అతిక్రమించిన వారిపైనా, మద్యం సేవించిన వారిపైనా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపైనా కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టుబడిన ఫైర్ క్రాకర్స్ను బాంబ్ డిస్పోజల్ బృందాల సహకారంతో గ్రామ శివార్లలో డిస్పోజ్ చేయాలన్నారు. సంకల్పం ప్లెక్సీలను, హెర్జింగులను ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, డ్రాప్ బాక్సులను కూడా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసి, అందులో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి, చర్యలు చేపట్టాలన్నారు.
వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులు, ఎన్టీపిఎస్, మిస్సింగు, 194 బి.ఎన్.ఎస్. కేసులు, మహిళలపై జరుగుతున్న దాడుల కేసులను, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తు పెండింగులో ఉండుటకుగల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తు పూర్తి చేయుటకు అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్ధేశం చేసి, గ్రేప్ కేసుల్లో 60 రోజుల్లోగా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జెందల్ ఆదేశించారు.
ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, డిటిసి డిఎస్పీ వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సీఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.