కర్నూలు జిల్లాలో కూలీల వలస పర్వం.. కారణాలేంటి?.

కర్నూలు జిల్లాలో కూలీల వలస పర్వం.. కారణాలేంటి?.

జనం న్యూస్ 24 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా 

కర్నూలు జిల్లా: దసరా ముగిసిన వెంటనే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల నుంచి కూలీలు పనుల కోసం వలస బాట పడుతున్నారు. వర్షాలు సమృద్ధిగానే ఉన్నా, అస్తవ్యస్తంగా కురవడంతో పంటలు దెబ్బతిని, స్థానికంగా పనులు లేక, కర్ణాటక, తెలంగాణ, తూర్పు ఆంధ్ర ప్రాంతాలకు వెళుతున్నారు. ఈ వలసలను "సుగ్గి" అని పిలుస్తారు. కోసిగి నుంచి 300, చిరంగల్ నుంచి 50 కుటుంబాలు ఇప్పటికే వలస వెళ్ళాయి. ఇదే తరహాలో పెద్దకడబూరు మండలం ముచిగేరి నుంచి కొన్ని కుటుంబాలు గుంటూరుకు, పెద్దకడబూరు ఎస్సీ కాలనీ నుంచి 50 మంది రాయచూర్‌కు వెళ్లారు. ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ ప్రాంతాల ప్రజలు ఏటా పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం సర్వసాధారణం. వ్యవసాయం, పండగలు, ఎన్నికల సమయంలో మాత్రమే వాళ్లు తిరిగి వస్తారు.ఎమ్మిగనూరు నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. కానీ, వర్షాలు సకాలంలో, సరిగ్గా కురవకపోవడంతో వ్యవసాయం దెబ్బతిని, ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది. 20,000 హెక్టార్లలో వర్షాధార పంటలు నాశనమయ్యాయి. తుంగభద్ర, గజులదిన్నె ప్రాజెక్టు, దిగువ తుంగభద్ర కాలువల ద్వారా నీరు సరిగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.దీంతో చాలా మంది రైతులు పంటలు వేయలేక వలస వెళ్తున్నారు. పూలచింత, ముగాతి, మిట్టసోమపురం, నందవరం వంటి గ్రామాల నుంచి రైతులు వలస బాట పట్టారు. ఎమ్మిగనూరుకు చెందిన రైతు హనుమంతు మాట్లాడుతూ, నందవరం నుంచి 3,000 మంది, ఎమ్మిగనూరు మండలం నుంచి 4,000 మందికి పైగా పనుల కోసం వలస వెళ్లారని చెప్పారు. వరంగల్, గుంటూరు, బెంగళూరు, హైదరాబాద్, ముంబై లాంటి నగరాలకు వెళుతున్నారట. అయితే, పంచాయతీరాజ్ శాఖ అధికారి మాట్లాడుతూ, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తున్నామని, కలెక్టర్ ఆదేశాల మేరకు పని దినాలను పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.