తునికాకు పెండింగ్ బోనస్ మరియు 2024 ఆకు సేకరణ బిల్లులు చెల్లించాలి.
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(TAGS) డిమాండ్.
జనం న్యూస్ 28. అక్టోబర్. కొమురం భీమ్ జిల్లా.
స్టాఫ్ రిపోటర్. దహేగం మండలం ఖర్జి గ్రామానికి చెందిన తునికాకు సేకరణదారుల పెండింగ్ బోనస్ మరియు 2024 సీజన్ ఆకు సేకరణ డబ్బులు చెల్లించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఫారెస్ట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం కార్యాలయ పాలనాధికారి వెంకట కృష్ణ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కొరెంగా మాల శ్రీ, జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ 2016 నుంచి తునికాకు బోనస్ పెండింగ్ లో ఉందని అనేకసార్లు పోరాటం చేసిన ఫలితంగా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం హడావిడిగా బోనస్ చెల్లించిందని కానీ జిల్లాలో దాదాపు 8,000 మందికి పెండింగ్ లో ఉండేనని సంఘం పోరాట ఫలితంగా ఇప్పటివరకు 5000 మంది వరకు బోనస్ వచ్చిందని ఇంకా 3,000 మందికి బోనస్ రావాల్సిందని, ఫారెస్ట్ కార్యాలయాల చుట్టూ అధికార ప్రజాప్రతినిధుల చుట్టూ ఆకు సేకరణ తిరుగుతున్నారని అధికారులు రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. ఆసిఫాబాద్ డివిజన్ గిరవెల్లి యూనిట్ లో, కాగజ్ నగర్ డివిజన్ లో అయితే 2024 సీజన్ కి సంబంధించిన ఆకుల కట్టల డబ్బులు సైతం రాలేదని దీనికి ఫారెస్ట్ అధికారుల తప్పిదమే కారణమని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న బోనస్ డబ్బులు చెల్లించాలని, 2024 సీజన్ ఆకు సేకరణ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలనాధికారి వెంకటకృష్ణ మాట్లాడుతూ సాధ్యమైన మేరకు అన్ని బిల్లులు వెళ్లేలా మేము ప్రయత్నం చేశామని అక్కడక్కడ కొన్ని పొరపాట్ల వల్ల ఇవి పెండింగ్ లో ఉన్నాయని వీటిని కూడా సాధ్యమైనంత తొందరగా లబ్ధిదారుల అకౌంట్లో పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్షురాలు కొరెంగా మాల శ్రీ, జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్, దిగడ బక్కన్న, కర్చి ఆకు సేకరణ దారులు ఒడిల హనుమంతు, తుమ్మడే సుగుణ, చౌదరి లక్ష్మి, జునగరి గణేష్, రౌతు వెంకటమ్మ, రౌతు పోసక్క, దన్నూరి శంకర్, కుబిడే బుచ్చన్న, ఒడిల నరేష్, ఒడిల పాపయ్య, బూసి అంజన్న తదితరుల పాల్గొన్నారు.