పోక్సో కేసులో నిందితుడికి మూడు సం.ల జైలు, జరిమానా
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్.,
జనం న్యూస్ 19 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా బూర్జవలన పోలీసు స్టేషనులో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేనులో నిందితుడు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పాచలవలస గ్రామానికి చెందిన సైలాడ లక్ష్మణరావు (33సం.లు)కు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు మూడు సంవత్సరాలు ఖైదు, రూ.2000/- లు జరిమానా విధిస్తూ నవంబరు 18న తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పాచలవలస గ్రామానికి చెందిన సైలాడ లక్ష్మణరావు అనే వ్యక్తి ఒక మైనరు బాలిక ఇంటర్ చదువుతున్న సమయంలో వెంటపడి వేధింపులకు పాల్పడుతూ, కిడ్నాప్ చేసి తీసుకొనిపోయి అత్యాచారం చేసాడని బూర్జవలస పోలీసు స్టేషనులో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి బూర్జువలస ఎస్ఐ కె.రాజేష్ కేసు నమోదు చేసారు. ఈ కేసును అప్పటి బొబ్బిలి సబ్ డివిజన్ డిఎస్పీ బి.మోహనరావు దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారు.ఈ కేసులో సకాలంలో సాక్షులను, సాక్ష్యాధారాలను న్యాయ స్థానంలో ప్రవేశపెట్టగా, ప్రాసిక్యూషను త్వరతిగతిన పూర్తి చేసి నిందితుడికి శిక్షపడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. నిందితుడు సైలాడ లక్ష్మణరావుపై నేరారోపణలు రుజువు కావడంతో స్పెషల్ జడ్జి ఫర్ పోక్సోకోర్టు శ్రీమతి కె.నాగమణి గారు నిందితుడు సైలాడ లక్ష్మణరావుకు మూడు సంవత్సరాల కారాగారం మరియు రూ.2000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున మాజీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మావూరి శంకరరావు వాదనలు వినిపించగా, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోర్టు హెడ్ కానిస్టేబులు విశ్వనాధం, సిఎంఎస్ హెచ్‌సి రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరుపర్చారన్నారు. పోక్సో కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.