మొండికేస్తున్న మిల్లర్లు .. మొదలుకాని కొనుగోళ్లు! వడ్ల కొనుగోలులో వీడని పరేషాన్..!!

మొండికేస్తున్న మిల్లర్లు .. మొదలుకాని కొనుగోళ్లు! వడ్ల కొనుగోలులో వీడని పరేషాన్..!!

జనం న్యూస్ 04 నవంబర్ 2024. జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా  

ఓ వైపు వర్షాలతో రైతుల్లో బుగులు
రాష్ట్రవ్యాప్తంగా 7,572 కొనుగోలు సెంటర్లకు ఇప్పటికి మొదలైనవి 4,598 కేంద్రాలే
మిల్లర్లతో పూర్తికాని చర్చలు.. రైతుల ఎదురుచూపులహైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం దింపుకోవడానికి మిల్లర్లు మొండికేస్తుండడంతో చాలాచోట్ల వడ్ల కొనుగోళ్లు షురూ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 7,572 కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకూ 4,598 సెంటర్లు మాత్రమే చాల్ అయ్యాయి. మొదలైన సెంటర్లలోనూ కొనుగోళ్లు పెద్దగా జరగడం లేదు. సర్కారు తీసుకువచ్చిన కొత్త పాలసీ మిల్లర్లకు మింగుడుపడడం లేదు. ఇన్నాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు అక్రమార్కులు ఇప్పుడు కఠినమైన నిబంధనలు తీసుకురావడంతో ధాన్యం దింపుకోవడానికి సుముఖత చూపించడం లేదు. ధాన్యం కేటాయించాలంటే క్లీన్చిట్ఉండడంతో పాటు బ్యాంక్ గ్యారంటీ చెల్లించాలనే నిబంధన వారి ఆగడాలకు అడ్డంకిగా మారింది. మొండికేస్తున్న మిల్లర్లు మిల్లర్లకు ధాన్యం కేటాయించాలంటే కచ్చితంగా బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్‌చేయాల్సిందేనని ప్రభుత్వం కొత్త పాలసీలో స్పష్టం చేసింది. గతంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇచ్చిన విధానాన్ని బట్టి గ్యారంటీలను సమర్పించేలా నిర్ణయం తీసుకున్నది. సీఎంఆర్ టైంకు ఇచ్చిన మిల్లర్లకు వారికి అప్రూవల్ అయిన మిల్లింగ్‌ కెపాసిటీకి తగ్గట్టుగా ధాన్యం మద్దతు ధర ఆధారంగా 10 శాతం బ్యాంక్‌ గ్యారంటీ కానీ లేదా రైస్ మిల్లుకు కేటాయించిన ధాన్యంలో 25 శాతం విలువైన సెక్యూరిటీ డిపాజిట్‌కానీ చెల్లించాలని షరతు పెట్టింది. అలాగే, సీఎంఆర్ పెండింగ్‌లో ఉండి డిఫాల్టర్గా మారి పెనాల్టీతో సహా క్లియర్‌చేసిన మిల్లర్లకు 20 శాతం బ్యాంక్‌ గ్యారంటీ సమర్పించాలని లేదా అప్రూవ్డ్ మిల్లింగ్ కెపాసిటీలో 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలని కండిషన్ ఉన్నది. డిఫాల్టర్గా ఉండి పెండింగ్‌ సీఎంఆర్ క్లియర్‌చేసి 25శాతం పెనాల్టీ పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టిన మిల్లర్లకు పెండింగ్‌లో ఉన్న పెనాల్టీ ధాన్యానికి 25 శాతం బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాలని, మిల్లింగ్‌అప్రూవ్డ్ కెపాసిటీలో 25 శాతం అదనంగా మరో బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందని కొత్త పాలసీలో స్పష్టం చేసింది. ఇక డిఫాల్ట్మిల్లర్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయించేది లేదని తేల్చి చెప్పింది. అయితే, ఇలా ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లులు రాష్ట్రంలో 791 ఉన్నట్టు సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రెండు, అంతకంటే ఎక్కువ సార్లు డిఫాల్ట్ అయిన మిల్లులు దాదాపు 386 ఉన్నట్టు తెలుస్తున్నది. కొనుగోళ్లలో వేగం పుంజుకోలే : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,598 కొనుగోలు సెంటర్లు తెరిచారు. అయితే చాల్ అయిన సెంటర్లలోనూ కొనుగోళ్లలో వేగం పుంజుకోలేదు. ధాన్యం దింపుకునేందుకు మిల్లర్లు మొండికేస్తున్నారు. దీంతో జిల్లా అధికారులు మిల్లర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇవి ఇంకా కొలిక్కి రాకపోవడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నది. ఈసీజన్లో ఇప్పటికే వడ్లు వచ్చే జిల్లాలు అయిన నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ పూర్తిస్థాయిలో చర్చలు కొలిక్కి రాలేదు. జిల్లాలవారీగా పరిస్థితి ఇది..మెదక్ జిల్లాలో.. మెదక్ జిల్లాలో 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇంకా ధాన్యం కొనుగోళ్లు షురూ కాలేదు. జిల్లాలో మొత్తం 104 రైస్ మిల్లులు ఉండగా.. గడిచిన సీజన్లలో సీఏంఆర్ ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దని నిర్ణయించారు. కేవలం 44 మిల్లులకు మాత్రమే అర్హత ఉన్నదని తేల్చారు. కాగా ఆ మిల్లర్లు సైతం తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే ధాన్యం దించుకుంటామని చెబుతున్నారు. మిల్లర్లతో అధికారులు జరుపుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ కారణంగా ధాన్యం కాంటా పెట్టడం లేదు. దీంతో వారం, పది రోజులుగా రైతులు కేంద్రాల వద్దే రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మరోవైపు అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలు జలమయమై పెద్ద మొత్తంలో ధాన్యం తడిసి ముద్దవుతున్నది. వర్షాల నుంచి ధాన్యం కాపాడుకోవడం రైతులకు కష్టమవుతున్నది. ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లాలో 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. ఇంతవరకు 124 సెంటర్లను ప్రారంభించారు. కానీ ఒక్కచోట కూడా వడ్ల కొనుగోలు ప్రారంభం కాలేదు. వర్షాల కారణంగా తేమశాతం ఎక్కువగా ఉండటం వల్లనే కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో.. నల్గొండ జిల్లాలోని కనగల్ మండలం పొనుగోడు ఐకేపీ సెంటర్ లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు నెమ్మదిగా సాగుతున్నాయని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొనుగోల్లు వేగవంతం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో.. సిద్దిపేట జిల్లాలో మొత్తం 417 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 140 సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో 3.6 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా, దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 140 మిల్లులు ఉండగా వీటికి ఇంతవరకు సీఎంఆర్ అలాట్ మెంట్ జరపలేదు. కొనుగోలులో జాప్యం, అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండడంతో గ్రామాల్లోనే రైతులు రూ.1,950 నుంచి రూ. 2,000 కు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. కేంద్రాలు ప్రారంభమైన చోట 10 రోజులనుంచి రైతులు ధాన్యం కుప్పల వద్ద కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. గద్వాల జిల్లాలో.. జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 58 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ 5 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు. ఒక క్వింటాలు వడ్లు కూడా కొనుగోలు చేయలేదు. జిల్లాలో 61 రైస్ మిల్లులు ఉన్నాయి. అందులో 11 రైస్ మిల్లులను డిఫాల్ట్ గా గుర్తించారు. 20 రైస్ మిల్లులలో కొంత పెండింగ్ సీఎంఆర్ ఉన్నప్పటికీ వారికి సంబంధించి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉన్నది. అదేవిధంగా 30 రైస్ మిల్లులకు ప్రభుత్వం నిర్ణయించిన రూల్స్ ప్రకారం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పటివరకు ఒక రైస్ మిల్లు కూడా ప్రభుత్వం నిర్ణయించిన రూల్స్ ప్రకారం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకపోవడంతో ఇంకా అగ్రిమెంట్చేసుకోలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ధర్నా తో కొనుగోళ్లు ప్రారంభించారు. జిల్లాలో 248 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు 238 సెంటర్లు ఓపెన్ చేశారు. ఆదివారం రోజే కొనుగోళ్లు షురూ చేశారు. రైస్ మిల్లర్లు వడ్లు దించుకోవడానికి ఒప్పుకోక పోవడంతో ఇన్ని రోజులు కోనుగోళ్లు ప్రారంభించలేదు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు ధర్నాకు దిగడంతో రైతులతో కలెక్టర్ మాట్లాడి, జిల్లావ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్ నగర్లో 189, నారాయణపేట జిల్లాలో 102 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. 3 వారాలు కావస్తున్నా ఇంత వరకు పూర్తిస్థాయిలో సెంటర్లను తెరువలేదు. తెరిచిన చోట రైతులు వడ్లు తీసుకురావడం లేదు. రెండు జిల్లాల పరిధిలోని రైతులు ప్రైవేట్ వ్యాపారులు, కర్నాటక వ్యాపారులకు వడ్లను అమ్మేస్తున్నారు. కొనుగోళ్ల కోసం ఎదురుచూపులు నెల రోజుల కింద వరి కోసి వడ్లను కూరెళ్ల ఐకేపీ సెంటర్ కు తీసుకొచ్చిన. ధాన్యాన్ని ఆరబెట్టినా ఇప్పటికీ వడ్లు కొంటలేరు. ఎందుకు కొంటలేరని అడిగితే అనేక కారణాలు చెబుతున్నారు. ధాన్యం కొనకపోవడంతో కేంద్రంలోనే వడ్ల కుప్పల వద్ద కాపలా ఉంటున్నాం. అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి.