విజయం సాధించేందుకు 3 అంశాలు అవసరం -జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి
జనం న్యూస్ 25 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
జీవితంలో విజయం సాధించాలంటే దృఢసంకల్పం,అంకితభావం, క్రమశిక్షణ వంటి మూడు అంశాలు అవసరమని జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. జీవితంలో విజయం సాధించడానికి ఈ మూడు అంశాలు మనలో ఉన్నప్పటికీ విజయం సాధించడంలో ఎన్నో అవరోధాలు,ఆటంకాలు ఎదురవుతుంటాయని వాటిని ధైర్యంతో ఎదిరించి నిలిచేవాడే జీవితంలో పూర్తిస్థాయిలో విజయం సాధిస్తాడని జిల్లా జడ్జి తెలిపారు. జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆనందగజపతి ఆడిటోరియంలో సామాజిక అవగాహన-జీవన నైపుణ్యాలు అన్న అంశంపై విద్యార్థులకు ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ దృఢసంకల్పం,అంకితభావం, క్రమశిక్షణ ఉన్నవారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంతోపాటు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటారని పేర్కొన్నారు.విజయం అంటే ఉద్యోగం సాధించడమే కాదని, జీవితంలో విజయం అనేది ఏ రూపంలో అయినా సాధించవచ్చని తెలిపారు.లక్ష్యసాధనలో ఓర్పు, సహనంతో పాటు మనం కచ్చితంగా సాధించగలమని మనపై మనకు నమ్మకం ఉండాలని అన్నారు. ఇవన్నీ కలిగిన వ్యక్తి తప్పకుండా జీవితంలో విజయం సాధించక తప్పరని అన్నారు. జిల్లా అదనపు జడ్జి కే.నాగమణి మాట్లాడుతూ పిల్లలకు ముందుగా తప్పు,ఒప్పులు నేర్పించేది తల్లిదండ్రులని, పిల్లలు చిన్న వయసులో తెలియక తప్పు చేస్తే అది తప్పుని ముందుగా మందలించేవారు తల్లిదండ్రులేనని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలు కనాలి అనేవారు,ఆ కలల్లో పెద్ద కలలుగా ఐఏఎస్,ఐపీఎస్ వంటివి సాధించాలని అనుకుంటే గ్రూప్ వన్-1,2 వంటి కలనైనా సాధించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జన విజ్ఞానానికి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పదమే లక్ష్యంగా ఆవిర్భవించిన జనవిజ్ఞాన వేదిక ప్రజల్లో అందవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు విద్యార్థులలో నైతిక విలువలు,సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రమేష్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.వి.ఆర్ కృష్ణాజి, డాక్టర్ ఎంవిఎన్ వెంకట్రావు,రాష్ట్ర సమతా విభాగం అధ్యక్షురాలు సుజాత సెంచురియన్ యూనివర్సిటీ ఏవో ఎన్విఎన్ సూర్యనారాయణ,జాతీయ నాయకులు గండ్రేటి లక్ష్మణరావు,జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ గండ్రేటి శ్రీనివాసరావు,జెవివి నగర అధ్యక్షుడు షిణగం శివాజీ,నగర ప్రధాన కార్యదర్శి పి.షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.