నా మీసం అంటే నాకు ప్రాణం.. మీసాలు లేకుండా బ్రతకలేను... ఒక విచిత్రమైన కథ.
జనం న్యూస్: కేరళకు చెందిన షిజ నల్లగా మీసాలు పెంచారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూసి కొందరు ప్రశంసించగా, మరికొందరు ఎగతాళి చేశారు. అయితే, పొగిడినా, తిట్టినా తనేం పట్టించుకోనంటున్నారు షిజ. "నా మీసాలంటే నాకు చాలా ఇష్టం" అని 35 ఏళ్ల షిజ వాట్సాప్ స్టేటస్‌లో రాసుకున్నారు. కిందనే మీసాలతో ఉన్న ఫొటో కూడా పెట్టారు. షిజను నేరుగా కలిసినవారు, లేదా ఫేస్బుక్లో ఆమె ఫొటో చూసినవారంతా 'ఎందుకు మీసాలు పెంచుతున్నారని ' అడుగుతుంటారు.
"నాకిష్టం.. చాలా ఇష్టం. ఇంతకుమించి ఇంకేం చెప్పలేను" అంటారామె. కేరళలోని కణ్ణూర్ జిల్లాకు చెందిన షిజ తన పేరుకు ముందు, వెనుక ఇంటి పేరు, తండ్రి లేదా భర్త, కులం పేర్లు ఏవీ పెట్టుకోలేదు.
కొంతమంది మహిళలకు ముఖంపై వెంట్రుకలు మొలుస్తాయి. ముఖ్యంగా, పెదాల పైన, గడ్డం మీద, చెంపల పైన దట్టంగా వెంట్రుకలు వస్తాయి. షిజకు కూడా చాలా సంవత్సరాలుగా పెదాల పైన దట్టంగా వెంట్రుకలు మొలిచాయి. ఇలా వెంట్రుకలు ఎక్కువగా మొలిచినవారు థ్రెడింగ్ చేయించుకుంటూ ఉంటారు. కనుబొమలు షేప్ చేసుకున్నట్టే పెదాల పైన వచ్చే సన్నని మీసాలను తొలగించుకుంటారు. షిజ కనుబొమలు థ్రెడింగ్ చేయించుకునేవారు కానీ, పెదాలపై వస్తున్న వెంట్రుకలు తొలగించుకోవాలని ఆమె ఎన్నడూ భావించలేదు. సుమారు అయిదేళ్ల నుంచి కిందటి నుంచి ఆమెకు మీసాలు దట్టంగా పెరగడం ప్రారంభమైంది. వాటిని అలాగే ఉంచుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. కొందరు మహిళలకు మీసాలు, గడ్డాలు ఎందుకు పెరుగుతాయి.. చికిత్స ఎలా మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
'మీసాలతో నేను అందంగా లేనని ఎప్పుడూ అనిపించలేదు'
"ఇప్పుడు మీసాలు లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. కోవిడ్ మహమ్మారి మొదలైనప్పుడు, బయటికెళ్లినప్పుడల్లా మాస్కు వేసుకోవడం నాకు నచ్చేది కాదు. ఎందుకంటే, అది నా మీసాలను కప్పేస్తుంది" అన్నారు షిజ. చాలామంది ఆ మీసాలు తీసేసుకోమని సలహాలిచ్చారు. కానీ, షిజ లెక్కచేయలేదు."నేను అందంగా లేనని నాకెప్పుడూ అనిపించలేదు. ఇలా ఉంటే బావుంటుంది, అలా ఉండకపోతే బావుంటుంది అని నాకెప్పుడూ అనిపించలేదు" అంటారామె. మహిళలకు ముఖంపై వెంట్రుకలు అందాన్ని ఇవ్వవని, వాటిని తొలగించుకోవాలన్నది సమాజంలో ఉన్న భావన. దానికి తగ్గట్టే హెయిర్ రిమూవల్ ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తూ వచ్చింది. వెంట్రుకలు తొలగించుకోవడానికి క్రీములు, వాక్స్ స్ట్రిప్స్, రేజర్లు, ఎపిలాటర్స్ లాంటి ఎన్నో సాధనాలు మార్కెట్లోకి వచ్చాయి. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. అయితే, ఇటీవల కాలంలో మహిళలు ఏటికి ఎదురీదడం ప్రారంభించారు. చాలామంది తమ ముఖ వెంట్రుకల గురించి పట్టించుకోవడం మానేశారు. వాటిని తొలగించుకునే ప్రయాస పడకుండా, తమ శరీరతత్వాన్ని అంగీకరిస్తున్నారు. షిజ లాగ కొందరు వాటిని గర్వంగా చూపిస్తున్నారు కూడా. 2016లో, బాడీ పాజిటివిటీ ప్రచారకర్త హర్నామ్ కౌర్ నిండుగా గడ్డం పెంచిన అతి పిన్న వయస్కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. తనను తాను ప్రేమించుకోవడం నేర్చుకోవాడానికి ముఖ వెంట్రుకలను అంగీకరించడం ఎంతో ముఖ్యమని హర్నామ్ కౌర్ పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు.