బాల్య వివాహాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 15 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ రైట్స్ ఫోరం మరియు ఎపి ప్రో చైల్డ్ గ్రూపు ఆధ్వర్యంలో “బాల్య వివాహాలు నిర్మూలిద్దాం - బాలల హక్కులను కాపాడుదాం” అనే వాల్ పోస్టరును విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలో నవంబరు 14న ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇందుకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహాలకు కారకులైన తల్లిదండ్రులు, పెద్దలు, వివాహాన్ని ప్రోత్సహించిన వారిపైనా చట్టరీత్యా చర్యలు చేపడతామన్నారు. బాల్య వివాహాలు చేయడంతో బాలలు అభివృద్ధి చెందే హక్కును కోల్పోతారని, వివాహానికి ఆడపిల్లలకు 18సం.లు, మగ పిల్లలకు 21సం.లు వివాహ వయస్సుగా చట్టం నిర్ధేశించిందని, చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా బాల్య వివాహాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలను పోలీసుశాఖ చేపడుతుందన్నారు. బాల, బాలికలు చదువుకునేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలని తనను కలిసిన బాలలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అధ్యక్షులు పి.చిట్టిబాబు మాట్లాడుతూ - అంతర్జాతీయ ఐక్య సమితి 1991సం.లో జరిగిన బాలల హక్కుల ఒడంబడికతో బాలలకు 56 హక్కులు కల్పించబడ్డాయని, అందుకు అనుగుణంగా బాలల రక్షణకు అనేక చట్టాలు తీసుకురాబడ్డాయన్నారు. ముఖ్యంగా బాలలు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామిగా హక్కులు అమలు చేయడంతో బాలల భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిద్దివచ్చనన్నారు.ఇందులో భాగంగా బాల్య వివాహాల నిషేద చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం, బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం వంటి కీలకమైన చట్టాలు అమల్లోకి వచ్చి, బాలలందరికి భద్రతను కల్పిస్తున్నాయన్నారు.18సం. లోపు బాలల హక్కులు ఎవరైనా ఉల్లంఘించినా, బాల కార్మికులుగా ఎవరైనా కనిపించినా, బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్లు 1098, 100 కు అందించాలని లేదా బాలల సంక్షేమ సమితి బెంచ్ సభ్యులను సంప్రదించ వచ్చునన్నారు. అనంతరం, డిస్ట్రిక్ట్ చైల్డ్ రైట్స్ ఫర్ ఫోరం సభ్యులు అదనపు ఎస్పీ పి.సౌమ్యలతను కలిసి చిల్డ్రన్ డే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డి.బి.ఎస్.యు. జిల్లా ఉపాధ్యక్షులు యందవ పోలయ్య, ప్రజ్వల సంఘం ప్రతినిధులు మొండూరి పోతరాజు, వూదరపల్లి రాము, డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కో ఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి మరియు చైల్డ్ రైట్స్ క్లబ్ ప్రతినిధులు షేక్ మస్కాన్, షేక్ నఫీషా, మోండూరు అజయ్, బబ్లూ, వంశీ, పోలసవల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.