వామ్మో ఏంటిది.. సెల్ఫీ కోసం వెళ్లి ప్రాణం పోగొట్టుకుంది. అవసరమా ఇంత రిస్క్ (వీడియో చూడండి)

జనం న్యూస్: ఫోటోలు దిగడం.. సెల్ఫీలు తీసుకోవడం.. ఆయా సందర్భాల్లో ప్రతీ ఒక్కరూ తీసుకుంటుంటారు. అయితే దానికో పద్ధతి.. విధానం ఉంటుంది. ఎలా పడితే అలా.. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటామంటే కుదరదు. కొన్ని సార్లు ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.. ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం. అయినా కూడా కొందరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంటారు. ఇందుకు తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణ. సహజంగా రన్నింగ్ ట్రైన్ వెళ్తుంటే భూమి అదురుతుంది. ఆ శబ్ధానికే గుండె అదురుతుంది. బాడీ షేక్ అవుతుంది. అలాంటిది ఒక యువతి ఏకంగా రైలు సమీపంలోకి వెళ్లి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేసింది. అంతే ఇంజిన్ ముందు భాగంగా తలకు తగిలి కుప్పకూలిపోయింది. స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మెక్సికోలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఒక స్పెషల్‌ ఈవెంట్‌ నిర్వహణ కోసం ఈ రైలును నడిపిస్తుంటారు. ఇదొక పాతకాలపు రైలు. దీనికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. అందుకే అది వెళ్లే దారిలో చాలామంది ఫొటోలు, సెల్ఫీలు, వీడియోల కోసం పోటీ పడుతుంటారు. హిడాల్గో సమీపంలో సెల్ఫీలు తీసుకునేందుకు జనం గుమిగూడారు. అయితే అందులో ఒక యువతి(20) తన కొడుకుతో కలిసి రైల్వే ట్రాక్ దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేసింది. అంతే ఇంజన్ ముందు భాగం తగలి స్పాట్‌లోనే మృతిచెందింది. విడ్డూరం ఏంటంటే.. యువతి ప్రాణాలు కోల్పోయి.. కిందపడిపోతే మిగతా వారు కనీసం దగ్గరకు రాకుండా మొబైల్‌లో వీడియోలు తీస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'ఎంప్రెస్' అనే ఈ రైలు 1930లో నిర్మించబడింది. ఇదొక ఆవిరి లోకోమోటివ్. స్పైక్ స్టీమ్‌లో భాగంగా కెనడా-మెక్సికో మధ్య నడవనుంది. ఈ ప్యాసింజర్ రైలు ఏప్రిల్‌లో కాల్గరీ నుంచి బయలుదేరింది. ఈ పర్యటన శుక్రవారం మెక్సికో సిటీలో ముగుస్తుంది. తిరిగి జూలైలో కెనడాకు వస్తుంది. ఇదిలా ఉంటే యువతి మృతి పట్ల కెనడియన్ పసిఫిక్ కాన్సాస్ సిటీ కంపెనీ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది. అలాగే విచారణకు సహకరిస్తామని తెలిపింది. రైలు ప్రయాణిస్తున్నప్పుడు ట్రాక్‌ల నుంచి కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.