3 ఏళ్ల నూరేళ్ల జీవితం త్యాగం.. అమ్మ నీకు వందనాలు

3 ఏళ్ల నూరేళ్ల జీవితం త్యాగం.. అమ్మ నీకు వందనాలు

జనం న్యూస్ 19 జూలై 2024 
ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ జనరేషన్ లో ప్రతీ మనిషికి ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. కొందరికైతే బాల్యం నుంచే ప్రాణాంతక వ్యాధులు, అవయవ లోపాలతో పుడుతూ తల్లిదండ్రులకు ఆనందాన్ని దూరం చేస్తున్నారు.

అయితే బిడ్డకు ఏ సమస్య వచ్చినా చూసుకునేది ముఖ్యంగా తల్లే కాబట్టి...ఓ మూడేళ్ల పసివాడికి కన్నతల్లి తన అవయవాన్ని ఇచ్చి ప్రాణదేవతగా మారింది. అయితే నవ మాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోసేది తల్లై అయినా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ప్రతీ మనిషికి పునర్జన్మ ప్రసాదించేది మాత్రం వైద్యులే. తెలంగాణ(Telangana)లోని ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital)వైద్యులు ఓ మూడేళ్ల బాలుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్(Liver transplant operation) ను విజయవంతంగా పూర్తి చేశారు. మూడేళ్ల పసిబాలుడికి కాలేయం ఇచ్చింది స్వయాన ఆ పిల్లవాడి తల్లే కావడం ఇక్కడ ఇంకో గొప్ప విషయం.

బిడ్డకు ప్రాణం పోసిన తల్లి..

లక్షలు రూపాయల ఫీజులు తీసుకుంటూ రోగుల ప్రాణాల్ని నిలబెట్టలేకపోతున్న కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే వైద్యులే బెటర్ అని మరోసారి రుజువైంది. హైదరాబాద్ ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్‌, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చోహన్ ఆదిత్య (3 సంవత్సరాలు) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. చోహన్ ఆదిత్యను పరిశీలించిన ఉస్మానియా వైద్యులు మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, కాలేయ మార్పిడి బృందం ఈ నెల మూడో తేదీన ఆదిత్యకు ఉస్మానియా ఆసుపత్రిలో కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది ఉస్మానియా వైద్య బృందం.

పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు..

చోహన్ ఆదిత్య మాతృమూర్తి అమల కాలేయాన్ని తన కుమారునికి దానం చేయడంతో కొంత భాగాన్ని తీసుకొని బాలునికి అమర్చారు. ప్రస్తుతం తల్లీకుమారుడు క్షేమంగా ఉన్నారు. వారిని మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిదిమంది చిన్నారులతో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతం కావడంతో ఆసుపత్రి వైద్యబృందాన్ని అందరూ అభినందిస్తున్నారు.

సాధారణ ప్రసవాలు చేసిన నర్సులకు ప్రోత్సాహకాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతోపాటు పుట్టిన వెంటనే శిశువులకు తల్లిపాలు పట్టించడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్న నర్సులు, నర్సింగ్ ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహకాలను ప్రకటించింది. సంవత్సరానికి 100 సాధారణ ప్రసవాలను చేసిన వారికి ప్రోత్సహాకాలను అందిస్తున్నట్లు ప్రత్యేక సర్క్యలర్ ను జారీ చేసింది.ఇందుకు రాష్ట్రంలోని 35 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ స్టాఫ్ కు ఇన్సెంటివ్స్ ను విడుదల చేసింది. పుట్టిన వెంటనే తల్లిపాలను పట్టించిన నర్సులకు ప్రతి శిశువుకు రూ.200 ప్రోత్సాహకంగా ప్రకటించింది. 92 డెలివరీ పాయింట్ల ప్రాతిపదికన ప్రోత్సహాకాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు.