80 వేల మంది ఎన్యుమరేటర్లతో ఇంటింటి సర్వే.. ప్రశ్నావళికి మంత్రివర్గం ఆమోదం
జనం న్యూస్ 27 అక్టోబర్ 2024. సీఎం రేవంత్ రెడ్డి నాలుగు నుంచి కులగణన
1 నుంచి గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. ఉద్యోగులకు ఒక డీఏ విడుదలకు ఓకే
జీవో 317, 46లపై అసెంబ్లీలో చర్చించి ముందుకు
రూ.24,269 కోట్లతో మెట్రో రెండో దశకు ఆమోదం
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారుల నిర్మాణం
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
నిర్ణయాల్ని వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం
భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం
భూములు, భవనాల అనుమతుల్లో పారదర్శకత
2 లక్షల దాకా రుణమాఫీ పూర్తి చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 27: ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన కులగణన నవంబరు 4న ప్రారంభం కానుంది. ఇందుకోసం 80 వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ప్రతి ఎన్యుమరేటర్ 150 ఇళ్లలో సర్వే చేయనున్నారు. నవంబరు 19వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన ప్రశ్నావళిని రాష్ట్ర మంత్రివర్గం శనివారం ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఐదు గంటలపాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కులగణనతోపాటు ఉద్యోగులకు ఒక డీఏ విడుదల చేయాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలకుగాను ఒక డీఏను దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.
దీంతోపాటు స్పౌజ్, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పరస్పర బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3500 మంది పేదలకు ఇళ్లను అందించాలని నిర్ణయానికీ ఆమోదం తెలిపారు. దీపావళి మరుసటి రోజు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకం లబ్ధిదారులను నవంబరు 1 నుంచి ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి ఎంపిక చేయనున్నారు. రూ.24,269 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితోపాటు మరికొన్ని కీలక అంశాలను క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపారు. ఆ వివరాలను రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు.
స్పౌజ్, పరస్పర బదిలీలకు ఆమోదం..
స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో నెం.317తోపాటు జీవో 46పైనా మంత్రివర్గం చర్చించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కొత్త నియామకాలకు జీవో నెం.46 వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికే ఉద్యోగాలు పొందినవారు జీవో నెం.317తో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం 13 సార్లు సమావేశమై చర్చించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో జీవో 317లో భార్యాభర్తలు(స్పౌజ్), ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారిని బదిలీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే జీవో 317తోపాటు జీవో 46 విషయంలో చట్టరీత్యా, న్యాయస్థానాల రీత్యా కొన్ని అడ్డంకులున్నాయన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించి, మిగిలిన కొన్ని అంశాలపై క్లియరెన్స్ కోసం రాష్ట్రపతి ఆమోదానికి పంపించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మూడు కేటగిరీలుగా మిల్లర్లు..
రాష్ట్రవ్యాప్తంగా 6వేలకు పైగా ధాన్యం సేకరణ కేంద్రాలకుగాను కొన్ని ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. గత ప్రభుత్వం మిల్లర్ల వద్ద భారీగా ధాన్యం నిల్వ చేసిందని, దాదాపు రూ.20 వేల కోట్ల విలువ చేసే ధాన్యం మిల్లర్ల వద్ద మిగిలిపోయిందని చెప్పారు. దీనిపై క్యాబినెట్‌లో చర్చ జరిగిందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో క్షుణ్ణంగా పరిశీలించి, ఆ రాష్ట్రాల కంటే మెరుగైన విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్లీన్ ఇమేజ్ ఉన్న మిల్లర్లను ఒకటో కేటగిరీలో, ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తర్వాత చ్లెలింపులు చేసిన వారిని రెండో కేటగిరీలో, నోటీసులు ఇచ్చినా ముందుకు రాకపోవడంతో రికవరీ చర్యలు తీసుకున్న మిల్లర్లను మూడో కేటగిరీలో చేర్చినట్లు వివరించారు. ఇక డిఫాల్టర్లను పూర్తిగా ధాన్యం సేకరణకు దూరంగా పెట్టాలని నిర్ణయించామన్నారు. కాగా, రూ.24,269 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. నాగోల్-శంషాబాద్, రాయదుర్గం- కోకాపేట, ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్‌చెరు, ఎల్‌బీనగర్-హయత్‌నగర్ మార్గాల్లో మొత్తం 76.4 కిలోమీటర్ల మేర రెండో దశను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించిననట్లు వెల్లడించారు. డీపీఆర్‌కు ఆమోదం తెలిపి, కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం పంపించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
పీపీపీ విధానంలో రోడ్ల నిర్మాణం..
రానున్న నాలుగేళ్లలో 16 వేల నుంచి 17 వేల కిలోమీటర్ల మేర పంచాయతీ, ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణం పీపీపీ విఽధానంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పొంగులేటి తె లిపారు. ఇదివ రకే వేసిన రోడ్లను మళ్లీ వేయడంతోపాటు కొత్తగా రోడ్లు వేయాల్సి ఉందని గుర్తు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. పాత జిల్లా యూనిట్‌గా దీనికోసం ఇంజనీరింగ్ శాఖ ముఖ్యఅ ధికారులతో కమిటీ వేసి, డీపీఆర్ తయారు చేయించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి రూ.28 వేల కోట్ల దాకా కానుండటంతో ఏ విధానంలో రోడ్లు వేయాలనే దానిపై కమిటీ తగిన నిర్ణయం తీసుకొని, ప్రభుత్వానికి సిఫారసు చేయనుందన్నారు.
మంత్రివర్గం మరికొన్ని నిర్ణయాలు..
ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణాన్ని గోషామహల్‌లో నిర్మించేందుకు నిర్ణయం. ఇందుకోసం పోలీసుశాఖకు చెందిన భూములు వైద్య ఆరోగ్యశాఖకు కేటాయింపు.
ములుగు గిరిజన యూనివర్సిటీకి 211 ఎకరాల భూమి కేటాయించాలని నిర్ణయం.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం.
మధిర, వికారాబాద్, హుజూర్‌నగర్‌లో స్కిల్ వర్సిటీకి అనుబంధంగా ఐటీఐల మంజూరు.
చోట్ల కొత్త కోర్టుల్లో ఉద్యోగాల మంజూరు. రెండు కాలేజీలకు ఉద్యోగుల మంజూరు.
28న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్
రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక పరంగా అన్ని కులాల సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు సంబంధించిన ప్రశ్నావళికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. దీనిపై ఈ నెల 28న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రయోగాత్మకంగా పలు జిల్లాల్లో 50 ఇళ్లలో ఇప్పటికే సర్వే చేసినట్లు, ఆ ఫలితాల ఆధారంగా కులగణనలో ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబసర్వే చేసినా.. ఆ వివరాలను అధికారికంగా బయటపెట్టలేదన్నారు. కులగణన చేపట్టాలని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టామని, నవంబరు 30లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. ఈ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకున్నా ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలకుగాను ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 2022 నుంచి డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ నిర్ణయంతో ఏటా రూ.3 వేల కోట్ల ఆర్థిక భారం పడుతున్నా... ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
డీఏ మంజూరుపై ఉద్యోగుల జేఏసీ హర్షం
పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉన్నప్పటికీ డీఏ ఇవ్వాలని సీఎం రేవంత్‌రె డ్డి తీసుకున్న నిర్ణయం ప్రజాపాలనపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు.
పూడిక తీతకు కడెం ప్రాజెక్టు ఎంపిక
రాష్ట్రంలో రిజర్వాయర్‌లలో పేరుకుపోయిన పూడికను ప్రయోగాత్మకంగా తీయడానికి వీలుగా కడెం ప్రాజెక్టును మంత్రివర్గం ఎంపిక చేసింది. ప్రాజెక్టుల్లోని పూడికతో ఆదాయం సమకూర్చుకోవడానికి వీలుగా కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది. పూడిక తీసిన మట్టిని రైతుల పొలాల్లో, ఇసుకను వాణిజ్య అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల్లో పూడికకు పర్యావరణ అనుమతి అక్కర్లేదని కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాలు జారీ చేయడంతో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా కడెం ప్రాజెక్టులో పూడికను తీయనున్నారు. ఈ ప్రాజెక్టులో పూడిక తీత వల్ల వచ్చిన ఫలితాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని తీర్మానించారు.
భూ ఆక్రమణలపై కఠిన చర్యలు: సీఎం రేవంత్
భూ ఆక్రమణలపై మరింత కఠినంగా వ్యవహరించాలన్న అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నా.. కొందరు అవినీతి అధికారులు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని, అలాంటివారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. క్యాబినెట్ భేటీ నుంచి అధికారులను పంపించివేశాక.. సీఎం, మంత్రులు దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రూ.600 కోట్ల లిడ్‌క్యాప్ భూములను ఇటీవలే రిజిస్ర్టేషన్ చేసిన రంగారెడ్డి జిల్లా బాలానగర్ సబ్ రిజిస్ర్టార్ అంశం చర్చకు వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. భూముల నుంచి భవన నిర్మాణాల అనుమతుల వరకు మరింత పారదర్శకంగా వ్యవహరించాలని, మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధికారుల అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక రూ.2లక్షల్లోపు రుణమాఫీకి అర్హులైన వారందరి రైతుల రుణమాఫీ క్లియర్ చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అది పూర్తయ్యాక ఆపైన ఉన్న రైతుల రుణమాఫీకి షెడ్యూల్ ప్రకటిద్దామన్నారు.