ఆన్లైన్లో లైకుల కోసం బైకుపై పిచ్చి స్టంట్లు.. కళ్ళ ముందే ప్రాణాలు విడిచారు.. పాపం (వీడియో చూడండి)
జనం న్యూస్: అసలే వర్షాలు.. రోడ్డంతా జారుతూ ఉంది. ఇలాంటి టైమ్‌లో డేంజర్ ఫీట్స్ చేస్తూ సోషల్ మీడియా రీల్స్ కోసం ఇద్దరు కుర్రాళ్లు చేసిన ప్రయత్నం ఇలా విషాదానికి కారణమైంది. కొడుకును కోల్పోయిన ఆ తల్లి ఇప్పుడు గుండెలు పగిలేలా రోదిస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు బైక్ స్టంట్స్‌కు బలైపోయాడని తెలిసి తట్టుకోలేకపోతోంది. శనివారం (జూలై 20) సాయంత్రం హైదరాబాద్ – విజయవాడ హైవేపై అంబర్‌పేట వద్ద వర్షంలో ఈ బైక్‌పై ఉన్న ఇద్దరూ స్టంట్స్ చేస్తుంటే.. మరో బైక్‌పై ఫ్రెండ్స్ ఈ దృశ్యాల్ని షూట్ చేస్తున్నారు. అయితే, క్షణాల్లోనే బైక్ అదుపుతప్పింది ఇద్దరూ కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో తోటి స్నేహితులు హుటాహుటీన సమీప ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ శివ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. బైక్ నడుపుతున్న యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. చేతికందిన కొడుకు ప్రాణాలు విడవడంతో ఆ తల్లిదండ్రులు దు:ఖాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.