కుల గణనకు రెడీ..!! వచ్చే నెల 4 నుంచి ఇంటింటి సర్వే
జనం న్యూస్ 28 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా నేడు హైదరాబాద్‌లో మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణ.... జిల్లా నుంచి సీపీవోతోపాటు ఐదుగురు ట్రెయినర్లకు పిలుపు,,, 1400 మంది ఎమ్యూనేటర్ల నియామకానికి అవకాశం 150 కుటుంబాలకు ఒక ఎమ్యూనేటర్ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సిబ్బంది వివరాల సేకరణ - స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై అభిప్రాయ సేకరణ స్థానిక ఎన్నికలతోపాటు రాష్ట్ర అభివృద్ధి, నూతన పథకాలకు ఉపయోగకరంగా మారే సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ కుల గణన సర్వేకు సంబంధించి కసరత్తు పూర్తి చేశారు. ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభించే దిశగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సర్వేకు సంబంధించిన ఎమ్యూనేటర్లు, ప్లానింగ్‌ను సిద్ధం చేశారు. జిల్లాలో 1300 వరకు బ్లాక్‌లు ఏర్పాటు చేసి దాని ద్వారా 150 కుటుంబాలకు ఒక ఎమ్యూనేటర్‌కు నియమించి సర్వే చేయనున్నారు. ఇందుకోసం జిల్లాలోని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న ఉద్యోగుల వివరాలను సేకరించారు. సర్వే కోసం 1400 మంది ఎమ్యూనేటర్‌లను ఉపయోగించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2014లో సమగ్ర సర్వే చేసినా కులగణనకు సంబంధించి దమాషాను వెల్లడించలేదు. ప్రస్తుతం రానున్న స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనరల్, రిజర్వేషన్ల ఖరారు కోసం కులగణన దోహదపడనుంది. కులగణనపై అన్ని రాజకీయ పక్షాలు, ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది. నేడు మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్రసర్వే కులగణనకు సంబంధించి మాస్టర్ ట్రెయినర్లకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం జిల్లా నుంచి సీపీవోతోపాటు మరో ఐదుగురు ప్రణాళిక సంఘానికి సంబంధించిన వారు మాస్టర్ ట్రెయినర్లుగా శిక్షణకు వెళ్తున్నారు. కులగణన జిల్లా ప్రణాళికా సంఘం పర్యవేక్షణలోనే సాగనుంది. రెండు నెలల పాటు పకడ్బందీగా కులగణన జరగనుంది. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా 171 రెవెన్యూ గ్రామాలు, 327 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ఇందులో 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 5 లక్షల 52 వేల 37జనాభా ఉంది. ఇందులో పురుషులు 2,74,109 మంది, మహిళలు 2,77,928 మంది ఉన్నారు. కుటుంబాలు 1,38,992 ఉన్నాయి. ఇందులో ఎస్సీలు 1,02,110 మంది ఉండగా పురుషులు 50,290, మహిళలు 51,820, ఎస్టీలు 22,990 మంది ఉండగా పురుషులు 11,342, మహిళలు 11,648 మంది ఉన్నారు. సెన్సెస్ జరగకపోవడంతో కుటుంబాల సంఖ్య పెరిగింది. దానికి అనుగుణంగానే సర్వేలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సర్వేలో సేకరించే వివరాలు సమ్రగ సర్వే కులగణనను నవంబరు 4న ప్రారంభించనున్నారు. సర్వేలో ఒక ఎమ్యూనేటర్ 150 ఇళ్లకు వెళ్లి సర్వే చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సర్వేకు సంబంధించిన ప్రశ్నావళిని మంత్రి మండలి ఆమోదించింది. సర్వేకు సంబంధించిన పూర్తి మార్గనిర్దేశనం ఈ నెల 28న కలెక్టర్లతో సీఎం నిర్వహించే కాన్ఫరెన్స్‌లో వెల్లడి కానుంది. ప్రతీ ఇంటికి వెళ్లి నిర్వహించే సర్వేలో 7 పేజీలతో 54 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నట్లు సమాచారం. కుటుంబ యజమాని నుంచి మొదలుకొని అతనికి సంబంధం ఉన్న వారి కులం, ఉప కులం, మాతృభాష, విద్య, ఆస్తుల వివరాలు, రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వివరాలు, ఇలా అనేక వివరాలను సేకరించనున్నారు. అధికారులకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. సోమవారం జరిగే శిక్షణలో పూర్తి వివరాలు అందిస్తారని భావిస్తున్నారు. వచ్చే నెల 1న బీసీ కమిషన్ రాక కరీంనగర్‌లో వచ్చే నెల 1న బీసీ కమిషన్ బృందం స్థానిక సంస్థల్లో కల్పించే రిజర్వేషన్ల ప్రక్రియపై అభిప్రాయాలను సేకరించనుంది. కరీంనగర్ కలెక్టరేట్‌లో నవంబరు 1న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీ, బీసీ వెల్ఫేర్ కమిషనర్‌ల బృందం అభిప్రాయాలను సేకరించనుంది. నిర్దేశిత నమూనాలను సంబధించి వెరిఫికేషన్ అఫ్‌డెవిట్ అరు సెట్లను తెలుగు లేదా ఆంగ్ల భాషాల్లో ఇచ్చే విధంగా సూచనలు చేశారు. కులగణన, రిజర్వేషన్లపై అభిప్రాయాల సేకరణతో జిల్లాలో సందడిగా మారింది.