కొత్త పార్లమెంట్ భవనం కాదు..140 కోట్ల ప్రజల కలల ప్రతి బింబం: ప్రధాని మోదీ

కొత్త పార్లమెంట్ భవనం కాదు..140 కోట్ల ప్రజల కలల ప్రతి బింబం: ప్రధాని మోదీ

 జనం న్యూస్ 29 మే 2023 :--కొత్త పార్లమెంట్ కేవలం భవనం కాదు.. 140 కోట్ల ప్రజల ఆకాంక్ష, కలల ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.కొత్త పార్లమెంట్ భవనం.. స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకార మాధ్యమంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ను ప్రజాస్వామ్య దేవాలయంగా ప్రధాని అభివర్ణించారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.భారత్‌ అభివృద్ధి.. ప్రపంచ వృద్ధికి ప్రేరణగా నిలుస్తుంది. చారిత్రక సమయంలో పార్లమెంట్లో సెంగోల్‌ ప్రతిష్టాపన జరిగింది. కర్తవ్యం, సేవకు ప్రతీకగా సెంగోల్‌ నిలుస్తుంది. సెంగోల్‌ గురించి మీడియాలో విస్తృత చర్చ జరిగింది. సెంగోల్‌కు పూర్వ ప్రతిష్ఠ, గౌరవం తీసుకురావాలి. దేశ ప్రగతి యాత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని గడియలు వస్తాయి. అమృతోత్సవవేళ చారిత్రక ఘటనలో ప్రజలు భాగస్వాములయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.ప్రపంచానికి భారత్ దృఢసంకల్ప సందేశం ఇస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. నూతన పార్లమెంట్ భవనం ఆత్మనిర్భర్‌ భారత్‌కు సాక్షిగా నిలుస్తుందని ఆయన తెలిపారు. నవ భారత్‌ కొత్త మార్గాలు నిర్దేశించుకుంటూ ముందుకెళ్తోందని అన్నారు. ప్రపంచం మొత్తం భారత్ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోందని స్పష్టం చేశారు. కొత్త ఆలోచనలు, సంకల్పంతో దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని పేర్కొన్నారు. భారత్‌ అభివృద్ధి.. ప్రపంచ పురోగమనంగా మారిందని వెల్లడించారు. పాత, కొత్త కలయికల అస్తిత్వానికి ఆదర్శంగా నిలుస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు.'పార్లమెంట్ పాత భవనంలో సభ్యుల కార్యకలాపాలకు ఇబ్బందిగా ఉండేది. అందుకే ఆధునిక, సాంకేతికతలతో కూడిన కొత్త భవనం ఆవశ్యకత ఏర్పడింది. కొత్త భవనం ప్రపంచ దేశాలకు ప్రేరణగా నిలుస్తుంది. 140 కోట్ల ప్రజల సంకల్పంతో కొత్త భవనానికి జీవం పోయాలి. స్వాతంత్ర్యం తర్వాత భారత్‌ కొత్త యాత్ర ప్రారంభించింది. ఎన్నో ఆటంకాలను దాటుతూ అమృతోత్సవ వేళకు చేరుకుంది. అమృతోత్సవ వేళ దేశం మరింత పురోభివృద్ధి దిశగా పయనించాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలను సాకారం చేసుకోవాలి. కొత్త భవనం భారత భవిష్యత్తును మరింత ఉజ్వలం చేస్తుంది.' అని మోదీ తెలిపారు.ప్రపంచ యవనికలో భారత్కు ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రధాని మోదీ అన్నారు. బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది నయాపంథాలో వెళ్తున్నామని తెలిపారు. భారత్‌ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తోందని మోదీ స్పష్టం చేశారు. కొత్త పార్లమెంట్ భవనం చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని వెల్లడించారు. పార్లమెంటు భవనం అనేక సంస్కృతులకు సమ్మేళనంగా నిలిచిందని తెలిపారు. భవనం ప్రతి అణువులో ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ భావన ఉంటుందని చెప్పారు.నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 రూపాయల నాణెం, పోస్టల్‌ స్టాంపును విడుదల చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవడానికి గుర్తుగా ఈ నాణేన్ని మోదీ విడుదల చేశారు. నాణేనికి ఓ వైపున పార్లమెంటు కొత్త భవనం ముద్రించి ఉంది. దానికి ఓ అంచున 'సంసద్‌ సంకుల్‌' అని దేవనగరి లిపిలో మరో అంచున పార్లమెంట్‌ కాంప్లెక్‌ అని ఆంగ్లంలో ముద్రించారు. నాణెంపై సింహం గుర్తు కలిగిన అశోకుడి స్తంభం ఉంది. దాని కింద 'సత్యమేవ జయతే' అని రాసి ఉంది. 35 గ్రాముల బరువుండే ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, చెరో ఐదు శాతం నికెల్‌, జింక్‌లోహాలతో తయారు చేశారు.  జనం న్యూస్ రిపోర్టర్ గట్టు మండలం