తెలంగాణకు దారిదీపం.. కేసీఆర్‌ దీక్ష..!!

తెలంగాణకు దారిదీపం.. కేసీఆర్‌ దీక్ష..!!

జనం న్యూస్ 09 డిసెంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా 

ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియకపోతే, ఎటుపోవాలో కూడా అర్థం కాదు. చరిత్ర చదవకుండా, భవిష్యత్తును నిర్మించలేం. గతం తెలుసుకోకుండా, గమ్యాన్ని నిర్ణయించుకోలేం.అందుకే, ప్రతి జాతి తన ఘనమైన గత వైభవాన్ని, పోరాటాలను, త్యాగాలను, విజయాలను, కథగానో, పాటగానో ఏదో ఒక కళారూపంలో నిత్యం గానం చేస్తూనే తర్వాతి తరాలకు అందిస్తూ ఉంటుంది.వీరులను, వీరగాథలను, వీరోచిత యుద్ధాలను నిత్యం స్మరించుకుంటూ ప్రతి దేశం, ప్రతి జాతి తన ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉడుకు నెత్తురుతో ఉన్న నూతన యువతకు పౌరుషాన్ని నూరిపోస్తూనే ఉంటుంది.పురాణేతిహాసాలు, ఒగ్గు కథలు, బుర్రకథలు, యక్షగానాలు, బతుకమ్మ పాటలు, నృత్యరూపాలు, చిత్రకళలు, చరిత్ర పాఠాలు, శిలాశాసనాలు ఎన్నెన్నో రకాలుగా ఘనమైన గతాన్ని, సంస్కృతిని, మహనీయులను, వైతాళికులను యాది చేసుకుంటూ ఉంటాం. ఏ జాతి అయితే తన చరిత్రను విస్మరిస్తుందో, ఆ జాతి పరాయి పెత్తనంలో బానిసగా మగ్గిపోతుంది. ఒక ప్రాంతాన్నో, ఒక దేశాన్నో ఓడించి వశం చేసుకున్న విజేతలు పరాజితుల చరిత్రను చెరిపేస్తారు.'మీకు చరిత్ర లేదు, సంస్కృతి లేదు, మేం అధికులం, మీరు అల్పులు' అని మానసికంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు.బ్రిటిష్‌ వాళ్ల నుంచి, సమైక్యాంధ్ర శక్తుల దాకా అదే పనిచేశాయి. స్పార్టకస్‌, గాంధీనో, మార్టిన్‌ లూథరో, మండేలానో.. ఎవరో ఒక యోధుడు మళ్లీ ఆ జాతిని మేల్కొల్పి విముక్తి చేయాల్సి వస్తుంది. ప్రతి జాతికి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి ఒక కథ ఉంటుంది. ఆ కథలో కథా నాయకులు, ప్రతినాయకులు, త్యాగాలు, విద్రోహాలు, విజయాలు, గుణపాఠాలు ఉంటాయి.రేపటి తరానికి ఆ కథను, గాథను నరనరాన ఎక్కించాలి. లేకపోతే, ఆ జాతి మళ్లా పరాయి దండయాత్రలోనే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది.తెలంగాణ తెలుసుకోవాల్సిన వీరోచిత ఘట్టం ఇది. మన జాతికి మహత్తరమైన పోరాటాల చరిత్ర ఉన్నది. ప్రపంచానికే పాఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ ఉన్నది. స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాలను సృష్టించి సంకెళ్లను తెంచుకున్న విజయం ఉంది. కుట్రలను, కుతంత్రాలను ఛేదించి, యావత్‌ జాతిని ఏకతాటిపై నడిపించి శాంతియుత పంథాలో వ్యూహాలు, ఎత్తుగడలు రచించి, ఉక్కు సంకల్పంతో, చెక్కు చెదరని నిబద్ధతతో గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు ఉన్నాడు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దండియాత్ర, సహాయ నిరాకరణ.. ఇంకెన్నో పోరాట ఘట్టాలు ఉన్నట్టే.. మలిదశ తెలంగాణ పోరాటంలోనూ మహోజ్వల సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి అద్భుత ఘట్టాల్లో కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష ఒక పతాక సన్నివేశం. పరమోత్కృష్ట దృశ్యం.ఒకసారి ఆదమరిచి అప్రమత్తత లేకుండా ఒక పొరపాటు చేస్తే అరువై ఏండ్లు తెలంగాణ అరిగోస పడ్డది. మూడు తరాలు పీడనకు బలికావాల్సి వచ్చింది. అందుకే.. తెలంగాణ వచ్చింది కదా ఇంకెందుకు ఉద్యమ యాది? మళ్లా ఎందుకు పోరాట చరిత్ర? అనుకుంటే పెద్ద పొరపాటవుతుంది. స్వాతంత్య్రం సాధించడం ఎంత ముఖ్యమో, దాన్ని నిలబెట్టుకోవడమూ అంతే ముఖ్యం. ఒక తరానికి ఆత్మగౌరవ పోరాటం నేర్పి కేసీఆర్‌ విముక్తి ఎట్లా సాధించాడో రేపటి తరానికి తెలియాలి. నిన్నటి పోరాటంలో హీరోలు ఎవరో, విలన్లు ఎవరో, శిఖండులు ఎవరో, ఎవరి పాత్ర ఏందో తెలిస్తేనే కదా ఈ జనరేషన్‌ జాగ్రత్తలు నేర్చుకుంటది. శత్రువు ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉంటాడు. తెలంగాణ ఏర్పాటుతో నష్టపోయిన శక్తులు మళ్లా ఏవో రూపంలో పెత్తనం కోసం ఆరాట పడుతూనే ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా దిగిపోగానే నిన్నటిదాకా అణగిమణగి ఉన్న కొన్ని శక్తులు ఎట్లా రెచ్చిపోతున్నాయో చూడండి. సమైక్యాంధ్ర నాయకుల సంచులు మోసిన తెలంగాణ ద్రోహులు మన అస్తిత్వంపై ఎట్లా ఎటాక్‌ చేస్తున్నారో గ్రహించండి.తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలైంది..సోనియమ్మ లేకపోతే తెలంగాణ అడుక్కుతినేదని అహంకారంతో వాగుతున్నడు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి. సోనియాగాంధీ దయా దాక్షిణ్యాలు, భిక్ష వల్లే తెలంగాణ వచ్చిందని తెలంగాణ ప్రజా పోరాటాన్ని కించపరుస్తున్నారు. ఒక గుజరాతీ వచ్చి విడిపించాడు. ఇంకో గుజరాతీ వచ్చి అభివృద్ధి నేర్పిస్తున్నాడంటూ బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి.. మలిదశ ఉద్యమాన్ని మొత్తం అవమానించేలా నోరు పారేసుకుంటున్నారు. గుజరాత్‌ గులాంలు ఒక పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు ఇంకో పక్క. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి వీళ్లతో ప్రమాదం పొంచి ఉన్నది.తెలంగాణ ఆనవాళ్లు చెరిపేస్తున్నారు. ఉద్యమంపై గన్ను ఎక్కుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపేస్తానని రెచ్చిపోతున్నడు. ఆయన చెరిపేయాలని చూస్తున్నది కేసీఆర్‌ ఆనవాళ్లను కాదు, తెలంగాణ ఆనవాళ్లను. అందుకే, తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్‌లను తొలగించాలనే దుర్మార్గమైన ఆలోచన చేశాడు. ఉద్యమం ఉద్భవించి.. తెలంగాణ జాతి ప్రణమిల్లే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేశాడు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి స్థానాన్ని కబ్జాపెట్టి రాహుల్‌గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టుకున్నారు.నీళ్లు, నిధులు, నియామకాలు.. ఉద్యమ నినాదమే కాదని నీల్గుతున్నాడు. ఇవేవీ.. మామూలుగా తీసుకోవాల్సిన విషయాలు కానేకావు. ఆత్మగౌరవం, అస్తిత్వం అస్మిత ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లమవుతాం. స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే.. ప్రస్తుత పార్లమెంట్‌లో మన గళం వినిపించేవాడే లేడు. తెలంగాణ ప్రయోజనాల కోసం పట్టుబట్టే వాడే లేడు. అందుకే, ఈ దీక్షా దివస్‌ జరుపుకొని పద్నాలుగేండ్ల పోరాట చరిత్రను మననం చేసుకుంటున్నాం. ఈ తరంలోనూ ఆత్మగౌరవ స్ఫూర్తిని రగిలించేందుకు ఇలాంటి దీక్షాదివస్‌ జరపడం అనివార్యం.ద్రోహాల కాంగ్రెస్‌ : కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు జీవగంజి పోసింది కేసీఆర్‌. 2004లో పొత్తు లేకపోతే కాంగ్రెస్‌ బతికే పరిస్థితే లేదు. తెలంగాణ ఇస్తామని మాట తప్పి పదేండ్లు గోస పుచ్చు కుంది కాంగ్రెస్‌. వందల మంది తెలంగాణ బిడ్డలను బలితీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వెన్నెముక లేని సన్నాసులు. సమైక్యాంధ్ర లీడర్లకు సంచులు మోసిన థర్డ్‌ గ్రేడ్‌ బాపతు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి వికటాట్టహాసం చేస్తున్నప్పుడు తెలంగాణ సోయి లేకుండా, కిమ్మనకుండా, అక్కడే పడి ఉన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వనని కిరణ్‌కుమార్‌రెడ్డి నిండుసభలో అన్నప్పుడు నోరెత్తలేదు. రాజీనామాలు చేయాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో పారిపోయారు. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్‌. 1969లో 369 మందిని కాల్చి చంపింది. 2001 మలిదశ ఉద్యమంలో కాలయాపన చేసి తెలంగాణ ముద్దుబిడ్డలను బలి తీసుకున్నది కాంగ్రెస్‌.రెండు కండ్ల సిద్ధాంతి చంద్రబాబు : తెలుగుదేశం మొదటినుంచీ తెలంగాణ వ్యతిరేకి. ఆఖరి ఘట్టంలో ఢిల్లీలో తెలంగాణకు వ్యతిరేకంగా లాబీయింగ్‌ చేసి బిల్లును ఓడించడానికి విఫల యత్నాలు చేసింది టీడీపీ. తెలంగాణ తెలుగుదేశం నాయకులంతా బాబు బంట్లే. ఉద్యమ ద్రోహులతో కలిసి ఊరేగినవాళ్లే. ఇప్పటి కాంగ్రెస్‌ సీఎం, అప్పటి తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డి ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టిన ద్రోహి.బీజేపీ దొంగాట : ఒక ఓటు, రెండు రాష్ర్టాలన్న బీజేపీ కాకినాడ తీర్మానం కాకి ఎత్తుకుపోయింది. చంద్రబాబుతో పొత్తులో ఉన్నన్నాళ్లు ఆయన ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ బీజేపీ నేతలు తెలంగాణ వాదం వినిపించాడానికే భయపడ్డారు. 'చంద్రబాబు వైఖరే, మా వైఖరి' అని నాడు జాతీయ బీజేపీ చెప్పుకున్నది. ఉద్యమంలో రాజీనామా చేయమంటే కిషన్‌రెడ్డి పారిపోయాడు. పోరాటాల్లో బీజేపీ చురుగ్గా ఏ రోజూ పాల్గొనలేదు. మోదీ ప్రతిసారి తల్లిని చంపి, బిడ్డను బతికించారని పార్లమెంట్‌లో అవమానిస్తూనే ఉన్నాడు. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష. తెలంగాణ గళం, దళం, బలం బీఆర్‌ఎస్‌. తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్‌ఎస్‌. తెలంగాణ ఇంటిపార్టీ, తెలంగాణ సొంత పార్టీ బీఆర్‌ఎస్‌. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి రక్షకుడు కేసీఆర్‌.చరిత్రను మలుపు తిప్పిన దీక్ష 2009, నవంబర్‌ 29. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక కొండగుర్తు. ఆత్మగౌరవ పోరాటంలో మూల మలుపు. చరిత్రను ముందు, తర్వాతలుగా విభజించిన రేఖ. ఢిల్లీ మెడలు వంచిన దీక్షాస్త్రం. మహాత్ముడి బాటలో మహోన్నత సత్యాగ్రహం. చావు నోట్లో తలబెట్టిన సాహసం. కేసీఆర్‌ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ శవయాత్రో, తెలంగాణ జైత్రయాత్రో.. ప్రాణాలను పణమొడ్డిన త్యాగధనుడి ఆమరణం. ఉత్తరం లేదు, దక్షిణం లేదు.. నలు దిక్కులదీ ఒక్కటే నాదం. కులం లేదు, మతం లేదు. ప్రతి మనిషిదీ అదే వాదం. అగ్నిపర్వతం బద్దలైనట్టు, భూకంపం పుట్టినట్టు, కడలి ఉప్పొంగినట్టు, తుఫాన్‌ తీరం దాటినట్టు.. ఆ పదకొండు రోజులు తెలంగాణ ఎవరెస్టు శిఖరమెక్కి శివతాండవమాడింది.పది జిల్లాల ప్రజలను ఏకశిలా సదృశ్యంగా నిలిపిన రోజు అది. విద్యార్థి లోకాన్ని ఉద్యమదారుల్లో ఉరికించిన దీక్ష. యూనివర్సిటీలను పోరాట కెరటాలు చేసిన దీక్ష. ఆ ఆమరణమే పట్టణాలను ప్రవహించే ఉత్తేజాలను చేసింది. పల్లె పల్లెనూ స్వాభిమాన సంద్రంగా మలిచింది. మన మస్తిష్కాల్లో అస్తిత్వ సోయిని నింపింది. చెక్కు చెదరని మనో నిబ్బరం. ఉక్కు సంకల్పంతో బక్క పలుచని మనిషి ఆమరణ దీక్ష కఠోరంగా సాగింది. చేసిన శపథం నెరవేరే వరకు, దీక్షాపథం వదిలేదే లేదని భీష్మించిన తమ ప్రియతమ నేతను రక్షించుకునేందుకు అశ్రు నయనాలతో దీక్షా విరమణ చేయమంటూ ఎన్నో విన్నపాలు.కానీ, 'పట్టు పట్టనేల పట్టి వదలనేల.. పట్టి విడుచుకంటే పడిచచ్చుట మేలు' అన్న నీతిపద్య సారాంశాన్ని జీర్ణించుకున్న మనిషిలా.. రుషిలా.. తపస్విలా.. మహాయోగిలా సాగించిన ఆ దీక్షా దక్షతను చూసి, ఉద్రేక శిఖరమెక్కి వీర తెలంగాణ, ధీర తెలంగాణ శివతాండవమాడింది. తెలంగాణ భగ్గుమంది. కొన్నెత్తుటి వాగైంది. స్వరాష్ట్ర సమరం.. ఉత్తుంగ తరంగమై ఎగిసింది. ప్రతి ఇంటి మీదా తెలంగాణ జెండా ఎగిరింది. పల్లె పల్లె బొట్టుపెట్టి బోనమెత్తింది. ఊరూరు బంతి పూలతోటై బతుకమ్మలాడింది. ఆట.. పాట.. మాట.. అంతా తెలంగానమే. పండగ, పబ్బం, ప్రతి సామూహిక సంబురం తెలంగాణ ఆకాంక్షల రూపమే.ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడులు, ర్యాలీలు, దీక్షలు, సభలు, సదస్సులు, ఆటలు, పాటలు, సకల నిరసన రూపాలు తెలంగాణ కోసం, తెలంగాణ నాయకుడి కోసం జరిగినై. రాష్ట్రం నిట్టనిలువునా చీలింది. మానసికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సచివాలయంలో, హైకోర్టులో, ప్రభుత్వ కార్యాలయాల్లో.. ప్రైవేట్‌ ఆఫీసుల్లో, ఐటీ కంపెనీల్లో, సినిమా ఫీల్డ్‌లో, బడిలో, గుడిలో, దవాఖానలో… ప్రతిచోటా తెలంగాణ అస్తిత్వం, ఆరాటం ఎగిసింది. ఆందోళనకరంగా మారిన తెలంగాణ అధినాయకుడి ఆరోగ్యస్థితిని చూసి ఆవేశం కట్టలు తెంచుకున్నది. పోరాటాల పుట్టిల్లు అట్టుడికింది. పార్లమెంట్‌ ప్రకంపించింది. ఆత్మగౌరవ సాగర హోరు కెరటాలు ఆకాశాన్ని తాకినయ్‌.ఐ తెలంగాణ విశ్వరూపాన్ని చూసి ఢిల్లీ దిగొచ్చింది.'సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే వచ్చేనా దేశానికి స్వాతంత్య్రం. రాజీలేని పోరాటమే జయిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ వచ్చితీరుతుంది'.. ఈ స్ఫూర్తిదాయక చరణం కేసీఆర్‌ కలం నుంచే జాలువారింది. తెలంగాణ ఉద్యమంలో గళంతో పాటు కలం కూడా కదిలింది. అందరితో 'జై తెలంగాణ' అనిపించిన ధీరుడు కేసీఆర్‌.తెలంగాణ 'స్వప్నం' కాదు 'సత్యం'డిసెంబర్‌ 9, రాత్రి పదకొండున్నర గంటలు.. హస్తినలో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను చదువుతుంటే.. మాటలకందని మహా ఉద్వేగమేదో మనసును కమ్మేసింది. యాభై నాలుగేండ్ల కల.. నిజమైన వేళ.. నట్టనడి రాతిరిలో నవ్వుమొగ్గ విచ్చుకుంది. కేసీఅర్‌ దీక్ష సబ్బండ వర్ణాలకు స్ఫూర్తి. ఆ దీక్షా దక్షత నల్లకోటు మిలిటెంట్‌ పోరాటాలకు ప్రోత్సాహం. తెల్లకోటు సృజనాత్మక ఆందోళనలకు ఉత్సాహం. చరిత్రను తవ్వి, ధోఖాల చిట్టా విప్పిన విద్యుత్‌ ఉద్యోగులకు ప్రేరణ. అసెంబ్లీ ఎంప్లాయీస్‌కు సంఘం పెట్టుకునే స్ఫూర్తి. ఐటీ కంపెనీల్లోనూ స్వరాష్ట్ర కాంక్ష రగిలించిన జ్యోతి. విదేశీ గడ్డమీద ఉన్న తెలంగాణ బిడ్డల్లో కన్నభూమిపై ప్రేమను రెట్టింపు చేసిన క్రాంతి.రెండు లక్షల కొలువులను మింగిన అనకొండ, ఏకంగా తెలంగాణ గుండెను ఫ్రీగా భోంచేద్దామని ఎత్తు వేసింది. సర్కారు లోపాయికారి సహకారంతో ఆంధ్రా లాబీ సుప్రీంకోర్టులో హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌ చేయించుకుంది. పుండు మీద కారం చల్లినట్టయింది. ఉద్యోగలోకం ఉరిమింది. సిద్దిపేట మహా వేదిక మీద సింహగర్జన. తెలంగాణ విజయయాత్రో.. కేసీయార్‌ శవయాత్రో.. ఏదో ఒకటి తేల్చుకునేందుకు ఆమరణ దీక్ష చేపడతానని ప్రకటన. అట్లా మొదలైన ఆమరణ దీక్ష, తెలంగాణ చరితనే గొప్ప మలుపు తిప్పింది. చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచింది.ఈ సునామీ ఒక్క రోజులో వచ్చింది కాదు. వేయి గొడ్లను తిన్న రాబందును నేలకూల్చే గాలివానను సృష్టించడానికి పదేండ్ల కృషి జరిగింది. దశాబ్దకాలం చేసిన భగీరథ యజ్ఞం, ఒక చైతన్య సంద్రాన్ని పుట్టించింది. ఆగ్రహోదగ్రమైన ఆఖరి తపస్సుతో అది జన ప్రళయమై వలస వంచనను ముంచెత్తింది. పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పునకు దారితీస్తయి. క్వాంటిటేటివ్‌ చేంజెస్‌ లీడ్‌ టూ క్వాలిటేటీవ్‌ చేంజ్‌! ఇది గతితార్కిక సూత్రం. ఏండ్ల తరబడి కోట్ల గుండెల్లోకి దట్టించిన ఆత్మగౌరవ మందుగుండు.. ఆమరణ దీక్ష వేళ మహా విస్ఫోటనమైంది. చిమ్మ చీకటిలో ఒక్కడే. అనుమానాలు, భయాలు, అంతటా అపనమ్మకం. చిమ్మచీకట్లు కమ్ముకున్న కల్లోల కాలం. బక్క పల్చనివాడు ఒక్కడే. ఉక్కు సంకల్పంతో వేశాడు ముం దడుగు. దండి గుండె దళపతి, మొండి ధైర్యంతో జలదృశ్యంలో గులాబీ జెండా ఎగిరేశాడు.

ఉష్ణరక్త కాసారంలా మసిలే తెలంగాణ నేల, ఉత్తర కుమారుల వల్లే వలస దోపిడీలో వసివాడిపోయింది. బానిసకొక బానిసై, వెన్నెముకలు లేని సన్నాసులై, మన్ను తిన్న గున్నపాముల్లా పడి ఉన్న ఈ చేవ లేని, చేత గాని రాజకీయ నేతలు, తరతరాల శాపమై మిగిలారు. నరనరాన పోరాట లావాలున్న ఈ గడ్డ శౌర్య పరాక్రమాలున్న బిడ్డ కోసం తపించింది. విముక్తి కోరుకునే జాతికి ఒక వీరుడు కావాలి. పుణ్యకాలం అప్పుడప్పుడూ అట్లాంటి పురుషులకు పురుడు పోస్తుంది. 2001, ఏప్రిల్‌ 27న అన్వేషణ ఫలించింది. ఎన్ని తిట్లు, ఎన్ని శాపాలు. ఎన్నెన్ని దాడులు, ఎన్నెన్ని గాయాలు. మఖలో పుట్టి, పుబ్బలో గిట్టుతుందనే హేళనలు. 'లెక్కకు రానీయడు కార్యసాధకుడు/ దుఖంబున్‌ సుఖంబున్‌ మదిన్‌..!' అన్నట్టుగా అన్నింటినీ తిప్పికొట్టి అప్రతిహత ప్రస్థానం సాగించిన సాహసికుడు. దాటివచ్చిన దారంతా ముళ్లూ, రాళ్లూ, లెక్కలేనన్ని చిక్కుముళ్లు. వెయ్యి దాడులు, లక్ష కుట్రలు, విచ్ఛిన్న పన్నాగాలు, విష ప్రయోగాలు.నిరంతర దాడుల పరంపర. ఒడిదుడుకులు, ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు ఎదుర్కొని నిలిచింది.. ఎక్కని మెట్లు లేవ్‌, తొక్కని గడప లేదు. జాతీయస్థాయిలో సమ్మతి సాధించడానికి హస్తినలో కేసీఆర్‌ ప్రదర్శించిన ప్రావీణ్యం, రాజకీయ నైపుణ్యం అమోఘం, అనితర సాధ్యం. ఏకాభిప్రాయ సాధనలో ఏకంగా 32 పార్టీల మద్దతు లేఖలు. దేశాన్ని ఒప్పించి మెప్పించిన ఆ లేఖాపర్వమే లేకపోతే తెలంగాణ లేదు. నినాదం, సమరనాదం.. 'ఉద్యమబాట వీడితే రాళ్లతో కొట్టి చంపండి'. 'తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దుపెట్టుకుంటా'. 'కేసీఆర్‌ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో'. 'ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి పోతున్నం.. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతా'. ఒక్కో నినాదం.. ఒక్కో నిప్పురవ్వ. దమ్ము, ధైర్యం, సాహసం, విశ్వాసాలకు ప్రతిరూపం.ఆ స్వరం భాస్వరం. ఆ మాట, ఆత్మగౌరవ తూటా. వెక్కిరించిన భాషను, ధిక్కారంగా మలచింది ఆ పలుకుబడి. యాసకు కొత్త శ్వాస, భాషకు బ్రహ్మోత్సవం. మంత్రముగ్ధం చేసే ఆ మాటపై తెలంగాణకు గురి. కేసీఆర్‌ చెప్తే తెలంగాణ విన్నది. వింటున్నది. వింటూనే ఉంటది. ఉడుకు నెత్తురు ఉరకలేసే విద్యార్థులు, ఆత్మగౌరవ పోరులో అగ్గిపిడుగులు. ఆలోచన.. ఆవేశం దట్టించి వదిలిన కేసీఆర్‌ మాటల తూటాలే వారికి తొలి పాఠాలు. బడిలో కేసీఆర్‌ మాటలు వింటూ పెరిగిన తరమే యూనివర్సిటీ ప్రాంగణాల్లో పరవళ్లు తొక్కింది. 2007, 2008 సంవత్సరాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించి వేలాది విద్యార్థులను సైనికులుగా తీర్చిదిద్దింది టీఆర్‌ఎస్‌.వివక్షలో మగ్గిన ఆటాపాటలకు పండుగలకు పునర్‌వైభవ పులకరింత.. సాంస్కృతిక పునరుజ్జీవ వైతాళికుడు.. ఆత్మవిశ్వాసానికి అసలు నిర్వచనం.. పాజిటివ్‌ థింకింగ్‌కు పరమరూపం కేసీఆర్‌. ఆయ నతో ఒకసారి మాట్లాడితే ఎవ్వరికైనా టన్నుల కొద్దీ విశ్వాసం వస్తుంది. భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. ఆశలు అడుగంటి, నమ్మకాలు నశించి, నిరాశా నిస్పృహలతో నీరసించి పోయినవాళ్లు ఆయనతో మాట్లాడాక కొండంత విశ్వాసంతో వెలిగిపోతుంటారు. ఈ పదకొండేండ్లలో ఎందరో పార్టీ నేతలు, ప్రజా సంఘాల లీడర్లు, కవి గాయకులు అట్లా రీచార్జ్‌ అయ్యారంటే అతిశయోక్తి లేదు. ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదన్నది ముఖ్యమే కాదు. కేసీఆర్‌ ఉన్నాడన్న ఏకైక విశ్వాసమే తెలంగాణ కలను సజీవంగా ఉంచింది.వాదమే వేదం, పదవులు గడ్డిపోచలు. ఉద్యమానికి ఊపిరులూదడానికి రాజీలేని రాజీనామాలు. తరుణం వచ్చిన ప్రతీసారి తలలు తెగ్గోసుకోవడానికి వెనకాడలేదు. ప్రపంచ చరిత్రలోనే ఏ నాయకుడూ.. ఏ పార్టీ ఇన్ని రాజీనామాలు చేయలేదు. పదవులను త్యజించడం, ప్రజల్లోకి వెళ్లి పదునెక్కడం. టీఆర్‌ఎస్‌ అనుసరించిన అపూర్వ వ్యూహం కరీంనగర్‌ ఉప ఎన్నిక. ఊహకందని వ్యూహరచనా దురంధరుడు కేసీఆర్‌.ఇంకేముంది, పనైపోయిందని అనుకునేలోపే ఇంతింతై వటుడింతై విస్మయపర్చడం ఈ చాణక్యు డి హాబీ. పడిపోయిందని ప్రచారం జరుగుతుండగానే.. ఉవ్వెత్తున ఎగసి ఉప్పెన సృష్టిస్తుంది గులా బీ. 2006 కరీంనగర్‌ ఉప ఎన్నిక సదా స్మరించుకునే ఎత్తుగడ. ఇంకెక్కడి తెలంగాణ అంటూ… హేళనగా విసిరిన సవాలును స్వీకరించి రాజీనామాస్త్రం సంధించాడు రాజకీయ రణధీరుడు. ఆకస్మిక దాడితో.. ప్రత్యర్థి శిబిరానికి దిక్కు తోచలే దు. శత్రువులందర్నీ ఒక్కచోట ఓడించిన ఆ గెలుపు చిరస్మరణీయం. వాదానికి వెయ్యేనుగుల బలం. భావజాలం.. ఉద్యమం.. రాజకీయం. 'ఇందుగలడందు లేడను సందేహం వలదు' కేసీఆర్‌ సర్వాంతర్యామి.ఎన్ని సమున్నత సన్నివేశాలు, మరెన్ని మహోజ్వల ఘట్టాలు ఆధునిక ప్రపంచం చూడని అపురూప పోరాట రూపాలు. ప్రతి పిలుపులో మలుపులో కార్యశూరుడి గళం. 'సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే వచ్చేనా దేశానికి స్వాతంత్య్రం. రాజీలేని పోరాటమే జయిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ వచ్చితీరుతుంది' ఈ స్ఫూర్తిదాయక చరణం కేసీఆర్‌ కలం నుంచే జాలువారింది. తెలంగాణ ఉద్యమంలో గళంతో పాటు కలం కూడా కదిలింది. అందరితో 'జై తెలంగాణ' అనిపించిన ధీరుడు కేసీఆర్‌. కాంగ్రెస్‌, టీడీపీ, కమ్యూనిస్టులు, కాషాయధారులు.. జెండాలు ఏవైనా, తెలంగాణే అందరి ఎజెండాగా మార్చింది అతడే. ఆర్‌ఎస్‌యూ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ దాకా వైరుధ్య భావజాలాలను వైవిధ్యంగా అల్లిన నేర్పు! నాయకుడే దిక్సూచి. పోరాటాల్లో ప్రజలూ ఉంటారు, నాయకులూ ఉంటరు.జనం లేని ఉద్యమం ఉండదు. అట్లాగే నాయకుడు లేని ఉద్యమమూ ఉండదు. ప్రజలే చరిత్ర నిర్మాతలు, అందులో సందేహం లేదు. అయితే.. చరిత్ర నిర్మాణంలో వ్యక్తుల పాత్ర గణనీయంగా ఉంటుంది! ప్రపంచ విప్లవ పోరాటాల్లో అద్భుత పాత్ర పోషించి మహా పురుషులై నిలిచిన వ్యక్తులున్నారు! ప్రజాశక్తిని ఒక లక్ష్యం వైపు మళ్లించి, విజయతీరాలకు చేర్చాలంటే మిన్ను విరిగి మీదపడినా చలించని నాయకత్వ పటిమ కావాలి.ఎత్తుగడలు, వ్యూహాలు, ఎదురుదాడులు, వెనకడుగులు… ఏ సమయంలో ఏది ఏ స్థాయిలో ప్రయోగించాలో అంచనా వేయగల రాజకీయ నైపుణ్యం ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సాధనా మహా పోరాటానికి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తిరుగులేని నేత. ఏ పారామీటర్స్‌తో కొలిచినా నిలిచే నిజమది. ఏ ఉద్యమంలోనైనా ఒక మెయిన్‌ స్ట్రీమ్‌ ప్రవాహం ఉంటుంది. అనేక ఇతర పాయలూ ఉంటయ్‌. అందరి కృషి అపురూపమే. క్రెడిట్‌ గోల ఎప్పుడూ ఉండేదే. రాజకీయ ప్రయోజన వాదం ఎటూ తప్పదు! కానీ.. చెరిగిపోని చరిత్ర ఒకటుంటుంది. ఎవరి స్థానమేంటో శిలాక్షరాలతో రాసిపెడుతుంది.