తోటి స్నేహితురాలిని పిచ్చి పిచ్చిగా కొట్టిన అమ్మాయిలు.. ఎందుకో తెలుసా..! వీడియో చూడండి
జనం న్యూస్: టీనేజ్ బాలికల అకృత్యానికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సాటి బాలికపై వారు రెచ్చిపోయి దాడికి దిగిన వైనం చూసి జనాలు షాకైపోతున్నారు. ఇంతటి దారుణం ఎక్కడా చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కూడా కలకలం రేపుతోంది. వర్సోవా ప్రాంతంలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను దీపికా భారద్వాజ్ అనే నెటిజన్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు టీనేజ్ బాలికలు గ్యాంగ్‌గా మారి మరో స్కూల్ విద్యార్థినిపై దాడికి తెగబడ్డారు. కాళ్లతో తన్నుతూ రెచ్చిపోయారు. నానా దుర్భాషలూ ఆడారు. సాటి బాలిక అన్న కనికరం కూడా లేకుండా ఇష్టారీతిన ఆమెను కింద పడేసి కొట్టారు. అంతమంది కలిసి ఒకేసారి దాడి చేస్తుంటే ఆ బాలిక నిస్సహాయురాలిగా మారింది. కనీసం ప్రతిఘటించలేక మిన్నకుండిపోయింది. ఆమెను కసితీరా కాళ్లతో తన్నాక వారు విడిచిపెట్టారు. ఆ తరువాత ఆమె వెళుతుంటే నోటికొచ్చినట్టు తిట్టిపోశారు. ఇంత జరుగుతున్నా కూడా వీధిలోని వారు ఒక్కరు కూడా బాలికల గ్యాంగ్‌ను అడ్డుకోలేదు. అయితే, కొందరు టీనేజ్ యువకులు మాత్రం వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. ఈ వీడియోను షేర్ చేసిన సదరు నెటిజన్ ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. అనేక మంది బాలికల తీరును దుయ్యబట్టారు. ఇక, వీడియోలో కొందరు బాలురు బాలికల తగాదాను చూసి హాస్యాలాడటంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. గొడవను ఆపే సామాజిక స్పహ కూడా వారిలో లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. కొందరు మాత్రం యువతలో పెడధోరణులు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొందరు ఈ మధ్య కాలంలో ఘోర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆక్షేపించారు. పెద్దల్లో కూడా మార్పు రావాలని ఆకాక్షించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. జనాలు షాకయ్యేలా చేస్తోంది.