దారుణం.. పిల్లలు పుట్టాలని భార్యతో అస్థికలు వేముకలు తినిపించిన భర్త...
జనం న్యూస్: మహారాష్ట్రలోని పుణె ప్రాంతంలో గగుర్పాటుకు గురి చేసే ఓ దారుణ సంఘటన జరిగింది. పిల్లలు పుట్టడం లేదని భార్యకు అస్థికలు తినిపించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలు సహా 8 మందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పుణె ధైరీ ప్రాంతంలోని సింహగడ్ రోడ్ కు చెందిన ఓ వ్యక్తికి 2019లో వివాహం జరిగింది. అయితే ఆ దంపతులకు సంతానం కలగలేదు. దీంతో మహిళను కొంతకాలంగా భర్త, అత్త మామలు వేధింపులకు గురి చేస్తున్నారు. క్షుద్ర పూజలు చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకంతో భర్త, అతడి కుటుంబ సభ్యులు మహిళను దారుణంగా హింసించారు. ఆమెను శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడికి జంతు బలి, నరబలి ఇచ్చే మాంత్రికుడిని పిలిపించి మహిళతో క్షుద్ర పూజలు చేయించారు. శ్మశానంలోని ఎముకలు తింటే పిల్లలు పుడతారని చెప్పి మహిళతో బలవంతంగా అస్థికలను తినిపించారు. ఈ దారుణ సంఘటన జరిగిన తర్వాత బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. అస్థికలు తింటే పిల్లలు పుడతారని తన చేత భర్త, అత్త మామలు బలవంతంగా తినిపించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో దిగ్భ్రాంతి గొలిపే పలు విషయాలు వెల్లడయ్యాయి. పిల్లలు పుడతారనే నెపంతో భర్త, అతడి కుటుంబ సభ్యులు బాధిత మహిళ పట్ల కర్కశంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. మహిళకు అస్థికలు తినిపించిన భర్త, అత్తమామలు, మాంత్రికుడు సహా ఎనిమిది మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన పట్ల మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకంకర్ కూడా స్పందించారు. బాధితురాలి పట్ల కర్కశంగా వ్యవహరించిన భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మూఢ నమ్మకాలను నమ్మి భార్యతో బలవంతంగా ఎముకలు తినిపించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.