నేను తలుచుకుంటే నిన్ను టెర్రరిస్టును చేస్తాను జాగ్రత్త..! ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..?

జనం న్యూస్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పోలీసు విభాగం ఫ్రెండ్లీ పోలీసింగ్‌ నినాదంతో ముందుకెళ్తోంది. ప్రజలతో సామరస్యంగా ఉండాలి. వారు ఎలాంటి భయం లేకుండా పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అంటూ ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. సామాన్యులపై రెచ్చిపోవడం, అధికార మదంతో నోటికొచ్చినట్లు మాట్లాడటం చేస్తున్నారు. అలా ఒక పోలీసాయన ఏకంగా టీచర్ తోనే అనుచితంగా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పే టీచర్‌ ని టెర్రరిస్టుగా మారుస్తానంటూ అందరి ముందు వార్నింగ్ కూడా ఇచ్చారు.ఈ షాకింగ్‌ ఘటన బిహార్ లో జరిగింది. ఒక వివాదంలో సెటిల్ మెంట్‌ కోసం టీచర్‌ పాట్నాకు 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమయి పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చారు. అయితే ఆ టీచర్‌ పోలీసులు పిలిచిన సమయం కన్నా 3 రోజులు ఆలస్యంగా వచ్చారు. అందుకు సంబంధించిన వివరణ కూడా వినేందుకు ఆ పోలీస్‌ రాజేశ్‌ శరణ్‌ ఇష్ట పడలేదు. టీచర్‌ తో కోపంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. రాజేశ్‌ శరణ్‌ దురుసు ప్రవర్తన చూసి అక్కడున్న వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. అసలు టీచర్‌ ఏం చెప్పాలి అనుకుంటున్నారో కూడా వినలేదు. తనకి నచ్చినట్లు మాట్లాడటం ప్రారంభించాడు. టీచర్‌ మాట్లాడుతుంటే కోపంతో ఊగిపోయాడు. రాజేశ్‌ శరణ్‌ కూర్చున్న కుర్చీలోంచి ఒక్కసారిగా లేచి కేకలు వేయడం ప్రారంభించాడు. “దూరం చేయడం మాకు ఒక్క సెకను పని. టెర్రరిస్టును కూడా చేసేయగలం” అంటూ టీచర్‌ కు వార్నింగ్ ఇచ్చారు. ఆ సమయంలో టీచర్ ఏదో మాట్లాడుతుండగా.. ‘ఏం అంటున్నావ్‌ రా?’ అతని మీదకు దూసుకెళ్లారు. ఈ మొత్తం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. టీచర్‌ కి పోలీసు ధమ్మీ ఇస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వైరల్ వీడియోపై జమయి పోలీసులు స్పందించారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపాలంటూ ఆదేసాలు జారీ చేశారు. రాజేశ్‌ శరణ్‌ పై చర్యలు తీసుకోవాలని, అతడిని సస్పెండ్‌ చేయాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.