పోలీసుల ఆత్మహత్య.. అంతుచిక్కని మిస్టరీ

పోలీసుల ఆత్మహత్య.. అంతుచిక్కని మిస్టరీ

జనం న్యూస్ 27 డిసెంబర్ 2024 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా 

కామారెడ్డి, : జిల్లాలో ముగ్గురి ఆత్మహత్యల కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్, ఓ యువకుడి ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మరణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సెల్ ఫోన్ డాటా, వాట్స్ ఆప్ చాటింగ్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఈ ముగ్గురి బంధువులు, స్నేహితులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురి పోస్టుమార్టం రిపోర్టులు కీలకం కానున్నాయి. ఇద్దరు పోలీసుల, ఓ యువకుడి ఆత్మహత్య రహస్యాన్ని చేధించేందుకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్ సీఐ సంతోష్, ఎస్సై రంజిత్‌లతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు నిన్న ఉదయం 11 గంటలకు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ బైక్‌పై బీబీపీట నుంచి బయలుదేరినట్లు పోలీసులు గుర్తించారు. నిఖిల్ తన బైక్‌ను ఎక్కడ పెట్టాడనేది తేలాల్సి ఉంది. అలాగే ఎస్ఐ సాయికుమార్ భార్య వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఇవాళ ఎస్ఐ సాయికుమార్ స్వగ్రామం మెదక్ జిల్లా కొల్చారంకు దర్యాప్తు బృందం వెళ్లి సమాచారాన్ని సేకరించనుంది. భిక్కనూరు, కామారెడ్డి, బిబిపేట, అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలోని హోటల్‌లలో సీసీ ఫుటేజ్‌లను దర్యాప్తు బృందం పరిశీలించనుంది. వారి ఆత్మహత్యకు కారణాలేంటి.. ప్రేమ వ్యవహారమా?..లేక వివాహేతర సంబంధమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.కాగా.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం కుప్రియల్‌ గ్రామ శివారులోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్దచెరువులో దూకి ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసుల ఆత్మహత్య న్యూస్ వైరల్‌గా మారింది. మెదక్ జిల్లాకు చెందిన సాయికుమార్ 2018లో ఎస్సై అయ్యారు. ప్రస్తుతం భిక్కనూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే 2014 బ్యాచ్‌కు చెందిన శృతి బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. శృతికి గతంలో వివాహం జరుగగా.. ఆ తరువాత విడుకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాయికుమార్, శృతికి మధ్య వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం ఉంది. ఆ తరువాత శృతికి నిఖిల్‌తో స్నేహం ఏర్పడి అది ప్రేమకు దారి తీసిందని.. ఇరువురు పెళ్లి చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన సాయికుమార్ నిన్న మధ్యాహ్నం శృతి దగ్గరకు వెళ్లారని.. ఆ తరువాత శృతి, నిఖిల్, సాయి కుమార్ కలిసి అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్దచెరువు వద్దకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. క్షణికావేశంలో శృతి చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా.. ఆమెను కాపాడబోయి సాయికుమార్, నిఖిల్ కూడా చెరువులో దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. మొక్కలు, నాచు తీగల మధ్య చిక్కుకుపోయి సాయికుమార్, నిఖిల్ ఊపిరాడక చనిపోయి ఉంటారని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. వీరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా.. శృతి మొహంపై గాయాలు ఉన్నాయని సాయికుమార్, నిఖిల్ కలిసి తమ కుమార్తెను హత్య చేశారని ఆమె తల్లి ఆరోపిస్తోంది.మొత్తానికి ఈ ముగ్గురి ఆత్మహత్యలు పోలీసులకు సవాల్ అని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఆత్మహత్యకు చేసుకున్నారు... వివాహేతర సంబంధమే కారణమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలో ఈ మిస్టరీని చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు..