వామ్మో.. టోల్ కట్టమన్నందుకు టోల్ బూత్ నే కూల్చి పారేసిన జెసిబి డ్రైవర్ (వీడియో చూడండి)
జనం న్యూస్: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టోల్ ఛార్జ్ పే చేయమని అడిగిన కారణంగా ఓ వ్యక్తి తన బుల్డోజర్‌తో టోల్ బూత్ ను ధ్వంసం చేశాడు. ఈ ఘటన ఢిల్లీ-లక్నో జాతీయ రహదారి హాపూర్ లోని టోల్ బూత్ వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. టోల్ ఎగ్జిట్ వద్ద బుల్డోజర్ ఇనుప స్తంభాలను ఢీకొట్టడాన్ని టోల్ కార్మికులు వీడియో చిత్రీకరించారు. టోల్ విషయంలో సిబ్బంది, బుల్డోజర్ డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన బుల్డోజర్ డ్రైవర్ టోల్ బూత్‌ను ధ్వంసం చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బుల్డోజర్ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. కాగా గతవారం కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇదే హాపూర్‌లో ఓ కారు డ్రైవర్ టోల్ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు ఏకంగా టోల్ సిబ్బందిపైకే కారుతో దూసుకెళ్లాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఛిజార్సీలోని టోల్ బూత్ వద్ద సీసీటీవీలో రికార్డైంది.