ఈ తప్పెవరిది.. నడి రోడ్డుపై పాడిగేదె కళేబరం ముగ్గురు బలి..

ఈ తప్పెవరిది.. నడి రోడ్డుపై పాడిగేదె కళేబరం ముగ్గురు బలి..

జనం న్యూస్: పాడిగేదె కళేబరం ముగ్గురి ప్రాణాలు తీసింది. ఆటోలో తన కూతురును అత్తగారింటికి వెళ్లే బస్సు ఎక్కించేందుకు వస్తున్న తల్లిదండ్రులను, ఆటోడ్రైవర్‌ను పరకాలోకాలకు చేర్చింది. ఈ ఘటనలో కూతురుతోపాటు మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వాజేడు గ్రామానికి చెందిన భార్యాభర్తలు కాకర్లపుడి సత్యనారాయణరాజు అలియాస్‌ ఎర్రబాబు (75), సత్యవతి (65)లు తమ కుమార్తె అనితను తన అత్తగారి ఊరైన ఆంధ్రప్రదేశ్‌లోని తుని (వైజాగ్‌) బస్సు ఎక్కించేందుకు స్థానిక తలండి నాగరాజు (20) ఆటోను మాట్లాడుకుని బయలుదేరారు. ఆటోలో నాగరాజుకు తోడుగా పెనుమళ్ల అంజిరెడ్డి అనే వ్యక్తి కూడా వస్తున్నాడు. ఐదుగురు కలిసి వస్తుండగా ఏటూరునాగారం మండలకేంద్రంలోని 163 జాతీయ రహదారి హైవే ట్రీట్‌ వద్ద అడ్డంగా పడి ఉన్న పాడిగేదె కళేబరాన్ని (నాలుగు రోజుల క్రితం మృతిచెందింది) ఆటోడ్రైవర్‌ తప్పించబోయాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కంటైనర్‌ వాహనం ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. కాకర్లపుడి సత్యనారాయణరాజు, సత్యవతి , ఆటోడ్రైవర్‌ నాగరాజు అక్కడికక్కడే చనిపోయారు. అనితతోపాటు అంజిరెడ్డికి తీవ్రగాయాలు కావడంతో 108లో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేయించి అనంతరం వరంగల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై తాజొద్దీన్‌ ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు మృతదేహాలను ట్రాక్టర్‌ ద్వారా తరలించారు. ఢీకొట్టిన కంటైనర్‌తో డ్రైవర్‌ పారిపోతుండగా జగన్నాథపురం వద్ద గ్రామస్తులు అడ్డుకొని నిలిపివేశారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.