ఒకడు భార్యను ఇంకోడు అత్తను కట్టర్ తో ముక్కలు ముక్కలుగా నరికి ఆ తరువాత... !

ఒకడు భార్యను ఇంకోడు అత్తను కట్టర్ తో ముక్కలు ముక్కలుగా నరికి ఆ తరువాత... !

జనం న్యూస్: ఢిల్లీలో శ్రద్ధావాకర్ ను ఆమె ప్రియుడు 35 ముక్కలుగా నరికి చంపిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ సంఘటన తర్వాత కూడా ఇటువంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. జార్ఖండ్ లో ఓ వ్యక్తి తన భార్యను ఎలక్ట్రిక్ కట్టర్ తో 12 ముక్కలు కోసి చంపగా.. రాజస్థాన్‌లో ఓ యువకుడు తన మేనత్తను సుత్తితో కొట్టి చంపి ఆమె మృతదేహాన్ని ఎలక్ట్రిక్ కట్టర్ తో పది ముక్కలుగా చేసి అడవిలో పడేశాడు. ఈ రెండు సంఘటనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రం సాహెబ్ గంజ్ లో దిల్దార్ అన్సారీ రుబికా పహాడిన్ అనే దంపతులు నివసిస్తున్నారు. రుబికా దిల్దార్ కు రెండో భార్య. కాగా రుబికా కొద్ది రోజులుగా కనిపించడం లేదు. మిస్సింగ్ పై రుబికా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సంతాలీ మోమిన్ ప్రాంతంలోని ఓ పాడుబడ్డ ఇంట్లో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను ఎవరో చంపి ఎలక్ట్రిక్ కట్టర్ తో 12 ముక్కలుగా చేసి ఆ ఇంట్లో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసులో రుబికా భర్త దిల్దార్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. రుబికాను తానే హత్య చేసి ఎలక్ట్రిక్ కట్టర్ తో ముక్కలు ముక్కలు చేసి పడేసినట్లు అంగీకరించాడు. మరొక సంఘటనలో రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో అనూజ్ శర్మ అనే యువకుడు తన మేనత్తను దారుణంగా హతమార్చాడు. అనూజ్ తన మేనత్త అయిన సరోజ్ శర్మ (64) ఇంట్లోనే ఉంటున్నాడు. సరోజ్ భర్త కొన్నేళ్ల కిందటే మృతిచెందగా.. ఆమెకు ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు. కాగా, ఇటీవల అనూజ్ కు అతడి మేనత్త సరోజ్ కు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఆమె తన విషయంలో జోక్యం చేసుకుంటుండటం అనూజ్ కి నచ్చలేదు. ఈనెల 11న అనూజ్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా అందుకు సరోజ్ అడ్డు చెప్పింది. దీంతో ఆగ్రహం చెందిన అనూజ్ మేనత్తను సుత్తితో కొట్టి చంపాడు. ఆ తర్వాత ఒక హార్డ్ వేర్ షాప్ కి వెళ్లి ఎలక్ట్రిక్ మెషీన్ తెచ్చి ఆమె మృతదేహాన్ని 10 ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలను ఒక బకెట్లో వేసుకొని ఢిల్లీ వెళ్లే నేషనల్ హైవే పక్కన అడవిలో వేర్వేరు చోట్ల పడేశాడు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా తన మేనత్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా అనూజ్ గదిని సరోజ్ కూతురు శుభ్రం చేస్తుండగా రక్తం మరకలు కనిపించాయి. ఆమె పోలీసులకు ఈ విషయాన్ని తెలపడంతో అసలు దారుణం వెలుగులోకి వచ్చింది.