నేర నియంత్రణకు నిరంతర ప్రక్రియగా వాహన తనిఖీలు
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 04 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లాలో గంజాయి, మద్యం, నాటుసారా, పశువుల అక్రమ రవాణను నియంత్రించుటలో భాగంగా ఆకస్మిక వాహన తనిఖీలను నిరంతర ప్రక్రియగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ డిసెంబరు 3న తెలిపారు.నేరాలను నియంత్రించుటకు, గంజాయి, మద్యం, నాటుసారా, పశువుల అక్రమ రవాణను అరికట్టుటకు ప్రతీరోజూ జిల్లా వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో వాహన తనిఖీలను నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు. తనిఖీల్లో ఎస్ఐ స్ధాయి అధికారి ఆధ్వర్యంలో ఆకస్మికంగా వివిధ ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టామన్నారు. వీటితోపాటు ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో విజిబుల్ పోలీసింగు నిర్వహిస్తూ, వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఈ తనిఖీల్లో వాహనదారులకు, ప్రజలకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. రహదారి భద్రతతోపాటు ప్రజలకు వివిధ చట్టాలు, సైబరు మోసాలు, మహిళల భద్రతతకు చేపట్టాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, నేరాలను అదుపు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
వాహన తనిఖీల్లో మోటారు వాహన చట్టం నిబంధనలు అతిక్రమించిన వారికి ఈ- చలానాలను విధిస్తున్నామన్నారు. వాహన తనిఖీల్లో ఇర్రెగ్యులర్ నంబరు ప్లేట్స్ కలిగిన వారిపై 280 కేసులు, యూనిఫాం లేకుండా వాహనాలు నడిపిన వారిపై 520 కేసులు, హెల్మెట్స్ ధరించని వారిపై 7020 కేసులు, సిగ్నల్స్ అతిక్రమించిన వారిపై 570 కేసులు, వాహన రికార్డులు లేని వారిపై 70 కేసులు, ప్రమాదకరంగా వాహనాలను నడిపిన వారిపై 209 కేసులు, అతి వేగంగా వాహనాలు నడిపిన వారిపై 24 కేసులు, సెల్ ఫోను మాట్లాడుతూ వాహనాలు నడిపిన వారిపై 220 కేసులు, ప్రమాదకరంగా వాహనాలను పార్కింగు చేసిన వారిపై 172 కేసులను గత 10 మాసాల్లో నమోదు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.