ఘోరం.. జలపాతంలో కొట్టుక పోయిన మొత్తం కుటుంబసభ్యులు.. లైవ్ వీడియో చూడండి.

జనం న్యూస్: జలపాతం అందాలు ప్రజల్ని ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. అందుకే ప్రకృతి ప్రేమికులు వాటిని చూసి ఆనందించేందుకు ఇష్టపడుతుంటారు. వారంతం వచ్చిందంటే చాలు.. సమీపంలో జలపాతాలను సందర్శించేందుకు వెళ్తుంటారు. అలా వెళ్లిన ఓ నిండుకుటుంబాన్ని విషాదం వెంటాడింది. ఒక్కసారిగా వచ్చిన వరద ఆ కుటుంబాన్ని బలితీసుకుంది. సరదాగా జలపాతం చూసేందుకు వెళ్లిన ఐదుగురిని ఊహించని వరద ముంచేసింది. వీరిలో ముగ్గురి మృతదేహాలు వెలికి తీయగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర పూణేలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో రుతుపవనాల వర్షాలు కొనసాగుతున్నాయి. వరదల కారణంగా పూణే జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసకుంది. ఆదివారం సెలవు దినం కావడంతో పూణేలోని లోనావాలాలోని భూషి డ్యామ్ జలపాతం వద్దకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే భూషి డ్యామ్‌ చూసేందుకు వచ్చి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు జలపాతంలో మునిగి మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ, నలుగురు పిల్లలు ఉన్నారు. ఒక్కసారిగా వరద చుట్టుమట్టడంతో వారు ఆ నీటి మధ్యలో చిక్కుకుపోయారు. సమీపంలోని స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదాన్ని పూణె ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ ధృవీకరించారు. ప్రమాదం అనంతరం మూడు మృతదేహాలను పోలీసులు వెలికి తీశారని తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. వారి కోసం రెస్క్యూ టీం పనిచేస్తుందని చెప్పారు. ఈ ప్రమాదంలో 36 ఏళ్ల మహిళ, 13 ఏళ్లు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు మృతి చెందారు. డ్యామ్ సమీపంలో నది నుండి మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వరదలో కొట్టుకుపోయిన మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలిస్తున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.