తక్షణమే మరమ్మతులు చేపట్టండి. అధికారులను హెచ్చరించిన మట్ట దయానంద్
(జనం న్యూస్) సెప్టెంబర్ 9 కల్లూరు మండల రిపోర్టర్ సురేష్ :- ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ పనికైన తక్షణమే అధికారులు స్పందించకపోతే సహించేది లేదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ అన్నారు. ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు కృంగిన ఊర చెరువు కట్టను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కట్ట పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలను వివరించారు. యర్రబోయినపల్లి గ్రామ పంచాయితీ నందు కొత్త, పాత యర్రబోయినపల్లి గ్రామాలను కలిపే ఊర చెరువు కట్టపై బీటీ రోడ్డు నాసిరకంగా నిర్మించడంతో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంగిపోయి ప్రమాదకరం గా మారిందని తెలిపారు. ఈ సమస్యతో భారీ వాహనాలు, పాఠశాలల బస్సులు ప్రయాణించటం కష్టతరంగా మారి పిల్లలని పాఠశాలకు పంపించడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఒకవైపు ఎడతెరపని వానలతో వాగులు, వంకలు, చెరువులు నిండి ఉధృతంగా అలుగులు పారడంతో కట్ట పరిస్థితి క్లిష్టంగా మారుతుందని తెలిపారు. సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఊర చెరువు కట్టను ఆయన పరిశీలించారు. చెరువు కట్ట పరిస్థితిని గ్రహించిన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా ప్రజలు అవస్థ పడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే మరమ్మత్తు పనులు ప్రారంభించక పోతే సహించేది లేదని అన్నారు. ప్రజల సౌకర్యార్థం పనిచేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటాన్ని తప్పు పట్టారు. పనులు జరిగే సమయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని మండిపడ్డారు. గుత్తేదారులు ఇష్టానుసారంగా వ్యవహరించటంతో ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా తక్షణమే స్పందించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. వెంటనే అధికారులు మరమ్మత్తులు పనులు చేయించకపోతే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్,ఏఎంసీ డైరెక్టర్ దొడ్డపనేని శ్రీనివాసరావు, పొట్రు సత్యం,పోట్రు అర్జున్ రావు,పోట్రు శ్రీనివాసరావు, కాంగ్రెస్ యువజన నాయకులు పోట్రు చక్రి, దొడ్డపునేని సుబ్బారావు, కొలకపోగు కృష్ణ,నల్లగట్ల పుల్లయ్య, రామడుగు మల్లాచారి, నల్లగట్ల వసంతరావు, రేపాకుల రామకృష్ణ, మండల నాయకులు ఏనుగు సత్యంబాబు, ఆళ్లకుంట నరసింహారావు, మట్టా రామకృష్ణ గౌడ్ ,భూక్య శివకుమార్ నాయక్, ధారావత్ మోహన్ నాయక్, బానోత్ పంతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.