దొంగతనానికి వచ్చి A.C వేసుకొని నిద్రపోయాడు.. సీన్ కట్ చేస్తే.. తరువాత ఎం అయ్యిందో మీరే చూడండి

దొంగతనానికి వచ్చి A.C వేసుకొని నిద్రపోయాడు.. సీన్ కట్ చేస్తే.. తరువాత ఎం అయ్యిందో మీరే చూడండి

జనం న్యూస్: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. లక్నో లోని ఓ డాక్టర్ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ.. మంచి ఏసీ కూలింగ్ ఉండటంతో.. అక్కడే నిద్రపోయి.. తెల్లారక పోలీసులకు చిక్కాడు. ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లక్నో నగరంలోని ఇందిరా నగర్ సెక్టర్ – 20లో సునీల్ పాండే అనే వైద్యుడికి ఇళ్లు ఉంది. బలరామ్‌పూర్ హాస్పిటల్‌లో పనిచేసే డా.పాండే ప్రస్తుతం వారణాసిలో డ్యూటీ చేస్తున్నారు. దీంతో, లక్నోలోని ఇల్లు ఖాళీగా ఉంచారు. అయితే, పాండే ఇంటి తలుపు తెరిచి ఉండటం చూసి ఇరుగుపొరుగు వారికి అనుమానం కలిగింది. వెళ్లి చూడగా లోపల ఓ దొంగ గుర్రతీస్తూ కనిపించాడు. ఇళ్లంతా చిందరవందరగా ఉన్నాయి. అతని పక్కనే రెండు గోనె సంచులు సామానుతో నింపి ఉన్నాయి. దీంతో, వారు వెంటనే సదరు ఇంటి ఓనర్‌తో పాటు… పోలీసులకు సమాచారం అందించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… పోలీసులు వెళ్ళి లేపేవరకు ఆ దొంగ పడుకునే ఉన్నాడు. లేవగానే పోలీసులను చూసి ఒక్కసారిగా బిత్తరపోయాడు.తెల్లవారుజామున సదరు దొంగ తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ఇన్వర్టర్ బ్యాటరీ, గీజర్, పాత్రలు, మరికొన్ని వస్తువులను రెండు బ్యాగుల్లో సర్దిన్నట్లు వెల్లడించారు.నిందితుడు ఇంట్లో కనిపించిన ప్రతి వస్తువును దొంగిలించుకుపోయే ప్రయత్నం చేశాడని వివరించారు. తలుపు, కప్ బోర్డులు పగలగొట్టాడని.. గ్యాస్ సిలిండర్, వాటర్ పంప్, వాష్ బేసిన్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని పోలీసులు చెప్పారు. వాటర్ పంప్ బ్యాటరీ తొలగించే క్రమంలో మద్యం మత్తు కారణంగా అతడు అక్కడే నిద్రపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రూమ్ అంతా ఏసీ కూలింగ్ ఉండటంతో.. కాసేపు నిద్రపోయి వెళ్దామని అతను అనుకుని ఉంటాడని.. కానీ మద్యం మత్తు కారణంగా అతడికి తెలివి రాలోదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొన్ని నెలల క్రితం ఓ దొంగతనం కేసు అరెస్టైన నిందితుడు.. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.