పత్రికా స్వేచ్ఛపై దాడి అనాగరికం

పత్రికా స్వేచ్ఛపై దాడి అనాగరికం

జనం న్యూస్ 10 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపై ఇటీవల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. పాత్రికేయ ప్రమాణాలకు లోబడి, రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తున్న కలం యోధులపై అక్రమ కేసులు  కలవరపరుస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యంపై ప్రభుత్వ దాడిగా భావిస్తూ ఈ ఫాసిస్టు ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
జిల్లా కేంద్రం విజయనగరం పట్టణ విలేకరి అల్లు సూరిబాబుపై సాలూరు పోలీసులు నమోదు చేసిన కేసు ముమ్మాటికీ అక్రమం.
దీని పూర్వాపరాలను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావడం మా బాధ్యత గా భావిస్తున్నాం. 
సుమారు రెండు క్రితం రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనుచరుల చిందులుపై ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఈ విషయాన్నే సాక్షి దినపత్రిక ప్రచురించింది. "దైవసన్నిధిలో టీడీపీ కార్యకర్తల చిందులు"శీర్షికతో సెప్టెంబర్17న ప్రచురితమైన ఆవార్తపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. సదరు వార్తను ఖండిస్తూ ప్రకటన ఇచ్చారు.  సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి సంధ్యారాణి ఆ ప్రకటనలో ప్రస్తావించారు.
దీన్ని ఆ మరునాడే సెప్టెంబర్18న "ఆ వీడియో దైవసన్నిధిలోనిది కాదు" అనే శీర్షికతో సాక్షి దినపత్రిక వార్తను ప్రచురించింది. అంతటితో ఆ వివాదానికి తెరపడింది.
ఈ పాత వివాదాన్ని తిరగదోడుతూ చల్లా కనకారావు అనే వ్యక్తి తాజాగా సాక్షి రిపోర్టర్ అల్లు సూరిబాబు పై  సాలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈయన మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనుచరుడని జర్నలిస్టులుగా మా పరిశీలనలో తేలింది. ఫిర్యాదు అందుకున్న సాలూరు పోలీసులు ప్రాధమిక సూత్రాలను పక్కకుపెట్టి హుటాహుటిన విజయనగరం వెళ్ళి "సాక్షి" రిపోర్టర్ అల్లు సూరిబాబుకు నోటీసులు ఇచ్చి విచారణ నిమిత్తం సాలూరు పోలీసుస్టేషన్ కు రావాలని హుకుం జారీ చేశారు. వార్త నేపథ్యం, మంత్రి ఖండనను సైతం ప్రచురించిన విషయాన్ని వివరణ ఇచ్చినప్పటికీ సాలూరు పోలీస్ స్టేషన్ కు రావాల్సిందేనని పట్టుబడుతున్నారు.

1.ఈ విషయంలో పోలీసుల అత్యుత్సాహాన్ని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులుగా గర్హిస్తున్నాము.

2.బాధిత రిపోర్టర్ అల్లు సూరిబాబుపై అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.

3.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాము.

4.పాత్రికేయులపై మానసిక,భౌతిక దాడులపై ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

5.పాత్రికేయులు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునే వాతావరణం కల్పించాలని వినమ్రంగా సూచిస్తున్నాము.

6.అక్రమ కేసులు, భౌతిక, మానసిక దాడులు, వేధింపులు వంటివాటిపై చట్టపరమైన రక్షణకు కమిటీని నియమించి, అందులో  జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలని కోరుతున్నాము.