లైవ్లో డ్యాన్సు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన టీచర్.. కరోనా తరువాత ఇలా అవుతున్నారెంటి.

జనం న్యూస్: కరోనా తర్వాత మనుషుల్లో ప్రాణ భయం మరింత పెరిగింది. రెప్పపాటు సమయంలో ప్రాణం గాల్లో కలిసిపోతున్న ఘటనలు పెరిగిపోతుండటమే ఇందుకు కారణం. అప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న వాళ్లు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. సెకన్లలోనే గుండె ఆగిపోయి ప్రాణం దేహాన్ని వీడిపోతున్న పరిస్థితులున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలోని భైంస్లానా అనే గ్రామంలో జరిగింది. ఫ్యామిలీ ఫంక్షన్లో ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా డ్యాన్సర్తో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఒక టీచర్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. గుండెపోటు కారణంగా కిందపడిన కాసేపటికే ప్రాణం పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కిందపడిన వెంటనే హుటాహుటిన ఆ టీచర్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.సైలెంట్ హార్ట్ అటాక్ కారణంగా ఆయన చనిపోయారని వైద్యులు వెల్లడించారు. జఖార్ అనే ఈ టీచర్ జోధ్పూర్లోని ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుండే వాడని తెలిసింది. ఈ ఫంక్షన్లో పాల్గొనేందుకే గ్రామానికి వెళ్లారు. ఇంట్లో ఫంక్షన్ కావడంతో ఫుల్ జోష్లో డ్యాన్సర్తో కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు. అంత సంతోషంగా ఫంక్షన్ను ఎంజాయ్ చేస్తున్న మనిషి సడన్గా అలా పడిపోయి ప్రాణాలు పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అప్పటిదాకా ఆనందాలు వెల్లివిరిసిన ఆ ఫంక్షన్లో విషాదం అలుముకుంది.