సమాజంలో మార్పు కోసం.. ప్రజలందరూ సహకరించాలి

సమాజంలో మార్పు కోసం.. ప్రజలందరూ సహకరించాలి

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 26 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
జిల్లాలో యువతను సన్మార్గంలో నడిపించేందుకు, వారిని చెడు వ్యసనాలు, మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆధ్వర్యంలో పోలీసుశాఖకు చేయూతను అందించేందుకు మేము సైతం.. అంటూ స్థానికఫూల్ బాగ్ ప్రజలు పార్కులో నిర్వహించిన "మార్పు కోసం.. మేము సైతం" అనే కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ సమాజంలో ఆశించిన మార్పు సాధించాలంటే.. ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించాలన్నారు. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి, వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కొంతమంది వ్యక్తులు తాను జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినపుడే తన దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. యువతలో చైతన్యం తీసుకొని వచ్చి, వారిలో మార్పు తీసుకొని వచ్చేందుకు 'సంకల్పం' అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతను గుర్తించి, వారిలో మార్పు తీసుకొని వచ్చేందుకు, అవసరమైన కౌన్సిలింగు, వైద్య సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అంతేకాకుండా, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతను సన్మార్గంలో నడిపించేందుకు ముందుగా హెచ్చరించామని, మార్పురాని వ్యక్తులపై కేసులు నమోదు చేసామన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించేందుకు సంకల్ప దీక్ష చేపట్టామని జిల్లా ఎస్పీ అన్నారు.గంజాయి అక్రమ రవాణ, వినియోగం, విక్రయాలు చేపడుతున్న వారిని అరెస్టు చేసి, అందుకు కారకులైన ప్రధాన సూత్రధారులను కూడా కేసుల్లో నిందితులుగా చేర్చుతున్నామన్నారు. మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు యువతకు అర్ధమైతే, ఎన్నటికీ వాటి జోలికి పోరన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని రాత్రి11గంటల తరువాత సహేతుకరమైన కారణం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. పూల్ బాగ్ కాలనీలో గంజాయి విక్రయించిన 25 మందిపైన, గంజాయి సేవిస్తున్న 18 మందిపై కేసులు నమోదు చేసామన్నారు. గంజాయి వినియోగిస్తూ పట్టుబడిన మరో 60 మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కౌన్సిలింగు నిర్వహించి, వారిపై నిఘా పెట్టామన్నారు. గంజాయి విక్రయాలు, రవాణకు పాల్పడుతున్న మరో 12మందిపై సస్పెక్ట్ షీట్లును ప్రారంభించి, వారిపై కూడా నిఘా పెట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు.పోలీసుశాఖ చేపడుతున్న చర్యలను పూల్బాగ్ ప్రజలు గుర్తించి, అభినందించి, మా బాధ్యతలను మరింత మెరుగ్గా నిర్వహించే విధంగా మమ్ములను ప్రోత్సహిస్తూ, స్ఫూర్తి నింపారన్నారు. పోలీసు బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలంటే ప్రజల నుండి మరింత సహకారం అవసరమన్నారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా పూల్ బాగ్ కాలనీలో కూడా సంకల్పం బాక్సులను ఏర్పాటు చేస్తున్నామని, గంజాయి, మాదక ద్రవ్యాల సమాచారాన్ని ఒక పేపరు మీద వ్రాసి బాక్సుల్లో వేయాలని, ప్రతీ వారం ఆ బాక్సులను తెరచి, ప్రజలందించిన సమాచారం మేరకు చర్యలు చేపడతామన్నారు. డ్రగ్స్ వ్యసనంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని, డ్రగ్స్ ను వినియోగించకుండా ఉండడమే ప్రధానమన్నారు. మన ప్రాంతంకు ఉన్న చెడ్డ పేరు తొలగి, మంచి పేరు రావాలంటే చెడు మార్గానికి స్వస్తి పలకాలని ప్రజలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కోరారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 2వ పట్టలు పోలీసులు ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తున్నారని, సమస్యలను పరిష్కరించుటలో చొరవ చూపుతున్నారని, గంజాయికి అడ్డాగా ఉన్న పార్కును మహిళలు స్వేచ్ఛగా తిరిగే విధంగా మార్చారని, అందుకు పోలీసుశాఖకు, జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను స్థానిక ప్రజలు, మహిళలు, కార్పొరేటర్లు, పూల మాలలు, పుష్పగుచ్ఛాలను అందజేసి, జ్ఞాపికలను అందజేసి, తమ కృతజ్ఞతలను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు, కార్పొరేటర్లు బొందెం ఆనంద్, మారోజు శ్రీనివాసరావు, వజ్రపు శ్రీనివాసరావు, జయరాజ్, కండేటి సన్యాసిరావు, 2వ పట్టణ పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.