సైబరు నేరాల నియంత్రణలో బ్యాంకు అధికారులు బాధ్యత వహించాలి
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,
జనం న్యూస్ 20 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
జిల్లాలో నమోదవుతున్న సైబరు మోసాల నియంత్రణకు బ్యాంకు అధికారులు కూడా బాధ్యత వహించాలని, సైబరు కేసులను దర్యాప్తు చేసే పోలీసు అధికారులకు తమ సహాయ, సహకారాలను అందించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నవంబరు 19న కోరారు. వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు మేనేజర్లు, ఇతర అధికారులతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - సైబరు మోసాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని, మోసగాళ్ళు క్రొత్త కొత్త తరహాల్లో మోసాలకు పాల్పడుతూ, ప్రజల నుండి డబ్బులను దోచేస్తున్నారని, ఈ తరహా మోసాలను నియంత్రించేందుకు బ్యాంకు అధికారులు కూడా సకాలంలో స్పందించి, తమ వంతు సహాయ, సహకారాలను పోలీసు అధికారులకు అందించాలని కోరారు. పోలీసు అధికారులు కూడా దర్యాప్తులో భాగంగానే బ్యాంకుల నుండి సమాచారాన్ని కోరడం జరుగుతుందన్న విషయాన్ని అధికార్లు గ్రహించాలన్నారు. దర్యాప్తు అధికారులు కోరిన సమాచారాన్ని బ్యాంకు అధికారులు సకాలంలో స్పందించి, అందించాలన్నారు. సమాచారాన్ని సకాలంలో ఇవ్వకుంటే మోసానికి పాల్పడిన వ్యక్తి తప్పించుకొనే అవకాశంతోపాటు నిందితుడి బ్యాంకు అకౌంటులో జమ అయిన నగదును ఇతర బ్యాంకు అకౌంట్లుకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.
క్రొత్తగా బ్యాంకు అకౌంట్ ను ప్రారంభించే సమయంలో వారి గుర్తింపు కార్డులను పూర్తిగా వెరిఫై చేసిన తరువాతనే బ్యాంకు అకౌంట్ ప్రారంభమయ్యే విధంగా చూడాలన్నారు. ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపే అనుమానస్పద బ్యాంకు అకౌంట్లపై నిఘా పెట్టాలన్నారు. ఎటిఎం కేంద్రాలు, బ్యాంకుల్లో సిసి కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉండే విధంగా చూడాలన్నారు. బ్యాంకులు, ఎటిఎం కేంద్రాలను రాత్రి గస్తీ సమయాల్లో పోలీసు సిబ్బంది, అధికారులు సందర్శించే విధంగా పాయింటు బుక్కులను ఏర్పాటు చేసుకొనే విధంగా స్థానిక పోలీసు అధికారుల సహకారాన్ని తీసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసుల్లో సమయం చాలా ముఖ్యమైనదని, ఇవ్వాల్సిన సమాచారాన్ని సకాలంలో బ్యాంకు అధికారులు దర్యాప్తు అధికారులకు అందిస్తే, మోసాలకు పాల్పడిన నిందితులు పరారీ కాకుండా త్వరితగతిన పట్టుకొనే అవకాశం ఉంటుందన్నారు. డిజిటల్ అరెస్టు, ఫెడెక్స్, బ్లూ డాట్ కొరియర్స్, లోన్ యాప్ మోసాలు, క్రెడిట్ కార్డు మోసాలు గురించి బ్యాంకు అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఫ్రీజ్ చేసిన నిందితుల బ్యాంకు అకౌంట్లలోని నగదును కోర్టు ఉత్తర్వులు మేరకు బాధితుల అకౌంట్లకు బదిలీ చేయాలని బ్యాంకు అధికారులను జిల్లా ఎస్పీ కోరారు. పోలీసు అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పని చేస్తే, సైబరు మోసాలకు గురైన బాధితులకు సత్వర న్యాయం అందించగలమని, అందుకు బ్యాంకు అధికారులు, పోలీసులు సంయుక్తంగా పని చేయాలని, అందుకు తమ వంతు సహాయ, సహకారాలను బ్యాంకు అధికారులు పోలీసుశాఖకు అందించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, సిఐలు ఎవి లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, టి.శ్రీనివాసరావు,ఎస్.శ్రీనివాస్, రవికుమార్, అప్పల నాయుడు, బి.వెంకటరావు, సతీష్ కుమార్, శంకర్రావు, బి.లక్ష్మణరావు, సూరి నాయుడు, వివిధ బ్యాంకులకు చెందిన మేనేజర్లు, ఇతర బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.