అత్యాచారంకు పాల్పడిన నిందితునికి 10 సం.ల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 11 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
విజయనగరం జిల్లా గంట్యాడ పోలీసు స్టేషనులో 2018 సంవత్సరంలో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడు గంట్యాడ మండలం కరకవలస గ్రామానికి చెందిన మద్దిల మురళీకి విజయనగరం మహిళా కోర్టు కమ్ 5వ ఎడిజె కోర్టు జడ్జి శ్రీమతి ఎన్.పద్మావతి గారు 10 సంవత్సరాల కఠిన కారాగారం మరియు రూ. 35 వేలు జరిమాన విధిస్తూ సెప్టెంబరు 10న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.వివరాల్లోకి వెళ్తే.. గంట్యాడ మండలం కరకవలస గ్రామానికి చెందిన నిందితుడు మద్దిల మురళీ అదే గ్రామానికి చెందిన ఒకామెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసి, అత్యాచారంకు పాల్పడినట్లుగా ఇచ్చిన ఫిర్యాదుతో గంట్యాడ పోలీసు స్టేషనులో 2018 సం.లో అప్పటి ఎస్ఐ పి.నారాయణరావు కేసు నమోదు చేయగా, అప్పటి విజయనగరం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.లక్ష్మణరావు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. అనంతరం, ఆయనకు బదిలీ కావడంతో, విజయనగరం రూరల్ సిఐగా బాధ్యతలు చేపట్టిన డి.రమేష్ దర్యాప్తు చేపట్టి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసును ప్రాధాన్యతా కేసుల జాబితాలోకి తీసుకొని ప్రాసిక్యూషను త్వరతిగతిన పూర్తి చేసి, నిందితుడికి శిక్షపడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. నిందితుడు మద్దిల మురళీ అత్యాచారంకు పాల్పడినట్లుగా నేరం రుజువు కావడంతో విజయనగరం మహిళా కోర్టు కమ్ 5వ ఎడిజె కోర్టు న్యాయమూర్తి శ్రీమతి ఎన్.పద్మావతి నిందితుడు మద్దిల మురళీకి 10సం.లు కారాగారం మరియు రూ.35,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎం.రవీంద్రనాధ్ వాదనలు వినిపించగా, విజయనగరం రూరల్ సర్కిల్ ఇన్చార్జ్ సిఐ జి.రామకృష్ణ పర్యవేక్షణలో గంట్యాడ ఎస్ఐలు సురేంద్ర నాయుడు, ప్రస్తుత ఎస్ఐ సాయికృష్ణ, కోర్టు కానిస్టేబులు కె.త్రినాధరావు సాక్షులను కోర్టులో హాజరుపర్చారన్నారు. కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్షపడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ అభినందించారు.