ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం.. దారుణం
జనం న్యూస్: మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మనందరితో కలిసి మెలిసి ఉన్నవాళ్లు హఠాత్తుగా మన నుండి దూరమైపోతుంటారు. కొన్నిసార్లు మృత్యువు ఇంట్లో ఏదో ఒక వస్తురూపంలోనే కబలిస్తుంది. ఇటీవల ఇంట్లో గ్యాస్ సిలిండర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఎలక్ట్రిక్ స్కూటర్ లాంటివి పేలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇంటిలోని ఫ్రిడ్జ్ పేలిపోలీస్ అధికారి, మహిళ మృతి చెందిన విషాదకర సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని నల్లూరులో గురువారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చెన్నైలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శబరినాథ్ తో పాటు మరో మహిళ కొద్దిరోజులుగా పొల్లాచ్చి సమీపంలోని నల్లూర్ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి పెద్దగా పేలుడు శబ్దం వినిపించిన ఇరుగుపొరుగు వారికి కిటికీల నుంచి పొగలు రావడం చూశారు. పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. కానీ అప్పటికే లోపల ఇన్‌స్పెక్టర్ తో మహిళ మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా పేలింది.. షార్ట్ సర్క్యూట్ కారణమా.. లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోనంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారాని పోలీస్ అధికారి తెలిపారు. గతంలో చెన్నై లోని కోదండరామ్ నగర్ లో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం చెందారు.