ఝాన్సిని నడి రోడ్డుపై జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్ పై చర్యలు..! (వీడియో చూడండి)

జనం న్యూస్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత బుధవారం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టుపట్టుకుని లాగిన పోలీసులపై న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ అన్నివైపుల నుంచి వచ్చింది. తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి యూనివర్శిటీ స్థలాన్ని కేటాయించడాన్ని నిరసిస్తున్న ఝాన్సీ ని స్కూటర్‌ పై ఉన్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు జుట్టు పట్టుకుని లాగడంతో ఆమె రోడ్డుపై పడి గాయాలపాలైంది. దీనికి సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇక ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ పోలీసులను నివేదిక కోరింది. ఈ ఘటనను పరిగణలోకి తీసుకుని ఇద్దరు పోలీసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించినట్లు కమిషన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడం.. మహిళా కానిస్టేబుల్ చేసింది తప్పేనని నిర్ధారణకు రావడంతో సీసీ చర్యలకు దిగారు. ఝాన్సీ జుట్టు లాగిన మహిళా కానిస్టేబుల్‌ని సస్పెండ్‌ చేశారు. జయశంకర్ వర్సిటీలో పోలీసుల తీరుపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏబీవీపీ మహిళా నాయకురాలు ఝాన్సీ జుట్టు పట్టుకున్న ఓ మహిళ కానిస్టేబుల్‌ ఆమెను కింద పడేసింది. టూ వీలర్‌పై వెళ్తూ రోడ్డుపై పరుగెడుతున్న ఝాన్సీ జుట్టుపట్టుకుని లాగింది కానిస్టేబుల్. దీంతో ఝాన్సీ కిందపడగా ఆమెకు గాయలయ్యాయి. వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడంపై విద్యార్థుల నిరసన చెబుతుండగా ఈ ఘటన జరిగింది.