సిగరేట్ కాలుస్తూ.. ఎగతాళి చేస్తూ.. జనగణమన పాడిన అమ్మాయిలు.. వీళ్లకు ఎంత కండకావరమో మీరే చూడండి.

జనం న్యూస్: మన జాతీయ గీతం జన గణ మన. నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఈ గీతాన్ని స్వాతంత్య్రానికి ముందు నుండే భక్తి, శ్రద్ధలతో, గౌరవంతో ఆలపిస్తున్నాం. చిన్నప్పటి నుండే ఈ గీతాన్ని మనలో భాగస్వామ్యం చేశారు పెద్దలు. ఈ గీతం దేశ సార్వభౌమత్వానికి నిదర్శనం. అందుకే ఈ గీతం విన్నా, ఆలపించినా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఈ గీతాన్ని అవమానించినా, అపహాస్యం చేసినా చట్ట విరుద్ధం. అయితే కొంత మంది మూర్ఖులు దేశాన్ని కించపరుస్తూ.. గీతాన్ని అవహేళన చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఈ గీతాన్ని అగౌరపరిచిన ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు జాతీయ గీతాన్ని ఆలపించిన విధానం వివాదాస్పదమైంది. చేతిలో సిగరెట్ పట్టుకొని, జాతీయ గీతాన్ని ఆలపించారు ఆ యువతులు. అంతేకాదు అందులోని సాహిత్యాన్ని తప్పుగా పాడుతూ, సిగరెట్ తాగుతూ నవ్వుతూ కనిపించారు. అంతేకాకుండా ఆ సిగరెట్‌ను జాతీయ జెండాతో పోల్చడం గమనార్హం. చివరకు అందులో ఓ అమ్మాయి క్షమాపణ కోరింది. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు వీరిపై తిట్టిపోశారు. దీంతో ఆ వీడియోను ఫేస్ బుక్ నుండి తొలగించిన అమ్మాయిలు.. ఫన్ కోసం ఈ వీడియోను చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వారిద్దరిపై బరఖ్‌పూర్ సైబర్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వీడియోను షేర్ చేసిన కొంత మంది వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే వారిని అరెస్టు చేసి జైలుకు తరలించాలని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇద్దరూ గనక దోషులుగా తేలితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని అంచనా వేస్తున్నారు.