నవరాత్రులకు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి
(జనం న్యూస్) సెప్టెంబర్ 5 కల్లూరు మండలం రిపోర్టర్ సురేష్ :- వినాయక చవితిని పురస్కరించుకొని జరుపుకునే నవరాత్రి ఉత్సవాలకు ప్రజలకు ఆటంకం కలిగించకుండా ప్రభుత్వం నిర్దేశించిన నియమ, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని లేనిచో చట్టపరమైన చర్యలు ఉంటాయని స్థానిక యస్ ఐ షేక్ షాకీర్ అన్నారు. బుధవారం పోలీస్ స్టేషన్ లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండగ నిర్వహించుకునే భక్తులు ఖచ్చితంగా కమిటీ ఏర్పాటుతోనే ఉత్సవాలను నిర్వహించాలని అన్నారు. వ్యక్తిగతంగా నిర్వహించినప్పటికీ కనీసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఉండాలని అన్నారు. గణేశుని విగ్రహం ఏర్పాటుకు పోలీస్ వారి లాగిన్ తో ఎటువంటి రుసుము చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. కానీ ప్రజలకు అంతరాయం కలిగించే విధంగా రోడ్లపై, వివాద స్థలాల్లో ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని అన్నారు. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తి స్థలాల్లో ఏర్పాటు చేసుకుంటే ఆ స్థలం యజమాని అనుమతి, ప్రభుత్వ స్థలాలయితే మండల తహశీల్దార్ పర్మిషన్ తీసుకోవాలన్నారు. నవరాత్రి ఉత్సవాలకు కేవలం మైక్ అనుమతి మాత్రమే ఉన్నదని, డీజే అనుమతులు కావాలంటే ఏసిపి అనుమతి తప్పనిసరి అన్నారు. ఎన్ని రోజులు మైక్ అనుమతి కావాలో ముందే తెలియజేయాలని అన్నారు. మీ సేవలో ఆన్ లైన్ లో డిడి చెల్లించి సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల అనుమతి తీసుకొని కరెంటు ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ ఏర్పాట్లు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని అన్నారు. నిమజ్జనం పూర్తయ్యేంతవరకు మండపంలో ప్రతిరోజు ఇద్దరు కమిటీ సభ్యులు రాత్రి వేళలో విగ్రహం వద్దనే ఉండాలని తెలిపారు. రోజుకు ఐదు సార్లు పోలీస్ సిబ్బంది ప్రతి విగ్రహం వద్దకు వచ్చి ప్రతి విషయాన్ని నోట్ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. భద్రతా దృష్ట్యా పూజా కార్యక్రమాలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు ముగించాలని అన్నారు. ఈ క్రమంలో ఎవరైనా నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తిస్తే అటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీస్ సిబ్బందికి సహకరించి ప్రశాంత వాతావరణంలో పండుగ వేడుకలను కుటుంబ సమేతంగా నిర్వహించుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.