బిజెపి మహిళా ఎంపీ అభ్యర్థిని హగ్ చేసుకున్న ఏస్.ఐ.. వెంటనే సస్పెండ్..! (వీడియో చూడండి)

జనం న్యూస్ : మాధవీలత ... తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు సంచలనం. హైదరాబాద్ పాతబస్తీలో మజ్లిస్ పార్టీదే హవా... అక్కడ అత్యధికంగా ముస్లిం జనాభా వుండటంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా వెనకుడుగు వెస్తుంటాయి. అలాంటిది ఓ మహిళ హిందుత్వ పార్టీగా ముద్రపడిన బిజెపి పాతబస్తీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇలా హైదరాబాద్ లోక్ సభ పోటీచేస్తున్న మాధవీ లత ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాఫిక్. పాతబస్తీలో ఎంఐఎం పార్టీని ఎదిరించి పోటీలో నిలవడమే కాదు ప్రచారాన్ని కూడా సరికొత్త రీతిలో చేపడుతున్నారు మాధవీ లత. ఈ క్రమంలో ఆమె వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల మసీదువైపు విల్లు ఎక్కుపెట్టినట్లుగా ఆమె ఫోజులివ్వడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఇది మరిచిపోకముందే మరో వివాదం రాజుకుంది. మాధవీలతను కలిసిన ఓ మహిళా పోలీస్ పై వేటు పడింది. 

అసలేం జరిగింది : 

హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు బిజెపి అభ్యర్థి మాధవీలత. హిందూ, ముస్లిం అని తేడాలేకుండా అందరినీ కలిసి పాతబస్తీలో మార్పు కోసం ఓటు వేయాలని కోరుతున్నారు. ఇలా సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాధవీ లత ప్రచారం నిర్వహించారు. దీంతో స్థానిక ఏఎస్సై ఉమాదేవి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా సెక్యూరిటీ నిర్వహించారు. అయితే గతంలో పరిచయం వుందో లేక మహిళా పోలీస్ అన్న అభిమానంతోనే మాధవీ లత ఏఎస్సైని సరదాగా పలకరించారు. దీంతో ఉమాదేవి కూడా మాధవీలతతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఇద్దరూ కరచాలనం చేసుకుని ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఈ హగ్ సదరు మహిళా పోలీస్ ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. ఎన్నికల విధుల్లో వుండగా ఏ రాజకీయ పార్టీకి, నాయకులకు అధికారులు అనుకూలంగా వ్యవహరించకూడదు. కానీ ఎన్నికల కోడ్ ను ఉళ్లంఘించేలా సైదాబాద్ ఏఎఎస్స్ వ్యవహరించారంటూ ఈసికి, పోలీస్ ఉన్నతాధికారులను ఫిర్యాదులు అందాయి. మాధవీలతను పోలీస్ డ్రెస్ లో వున్న ఉమాదేవి ఆలింగనం చేసుకుంటున్న వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో సదరు ఏఎస్సై ఉమాదేవిపై యాక్షన్ తీసుకున్నారు... ఆమెను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.