శృతిమించిన కళాకారులు.. బహిరంగంగా మెడను కొరికి రక్తం తాగి.. చీ..చీ (వీడియో చూడండి)
జనం న్యూస్: ఏపీలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ కళాకారుడు స్టేజీపైనే కోడి మెడ కొరికి చంపాడు. దాని రక్తం పీల్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జుగుప్సాకరమైన ఈ ఘటనపై పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) స్పందించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అనకాపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అనకాపల్లిలో స్థానికంగా ఓ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ డాన్స్ ప్రదర్శన సందర్భంగా ఈ ఘటన సంభవించింది. ఓ కళాకారుడు శృతి మించాడు. తమిళ హీరో లారెన్స్ రాఘవేంద్ర స్వీయ దర్శకత్వంలో 2011లో విడుదలైన హారర్ కమెడీ మూవీ కాంచన సినిమాలోని విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన అనే పాటలో ఆ డాన్సర్ రెచ్చిపోయాడు. లారెన్స్ తరహాలోనే ఎర్ర చీర కట్టుకుని ఊగిపోయాడు. ఓ కోడి మెడను కొరికాడు. శరీరంలో నుంచి మెడను వేరు చేశాడు. అందరూ చూస్తుండగానే దాని రక్తాన్ని పీల్చి తాగాడు. ఆ సమయంలో అతని ముఖం, శరీరం అంతా రక్తమయం అయింది. అతని చేతుల్లో విలవిల్లాడుతున్న ఆ కోడిని అలాగే చేతుల్లో పట్టుకుని డాన్స్ చేశాడు. ఈ నెల 6వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కాస్త పెటా కంట్లో పడింది. వెంటనే ఆ సంస్థ ప్రతినిధులు అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి చర్యలు క్రూరత్వానికి నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. డాన్సర్‌తో పాటు డాన్స్ ట్రూప్ కంపెనీ విష్ణు ఎంటర్‌ప్రైజెస్, నిర్వాహకులపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. పెటా ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. భారత్ న్యాయ సంహితలోని సెక్షన్ 429 ఆర్/డబ్ల్యూతో పాటు ప్రీవెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 11 (1) (ఏ) కింద కేసు నమోదు చేశారు.