శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా అక్టోబర్ 14, 15 తేదీల్లో భక్తులకు ఉచిత దర్శనం
జనం న్యూస్ 23 సెప్టెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో అక్టోబర్ 14,15 తేదీల్లో జరిగే తోల్లేళ్లు ఉత్సవం మరియు సిరిమానోత్సవం పూర్తయ్యే వరకు భక్తులకు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సిరిమానోత్సవం సందర్భంగా శ్రీ అమ్మవారి చదురుగుడి మరియు వనంగుడి దేవాలయాలకు భక్తులు తాకిడి అధికంగా ఉండే దృష్ట్యా భక్తులందరికీ ప్రీగా సర్వదర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో తొల్లేళ్ళు మరియు సిరిమానోత్సవం రోజు రూ|| 100, రూ|| 300, రూ|| 50 వంతున టిక్కెట్లను విక్రయించి దర్శనం చేయించేవారు. ఈ టిక్కెట్ల అమ్మకం ద్వారా దేవాలయానికి సుమారుగా రూ|| 15 లక్షలు ఆదాయం వచ్చేది. రాష్ట్రంలో ప్రజలకు అమ్మవారి దర్శనం ఫ్రీగా జరిపించాలని, తద్వారా లక్షలాదిమంది భక్తులు ఈ ఉత్సవాన్ని ఉచితంగా తిలకించే భాగ్యాన్ని కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించి లక్షలాది మంది భక్తులు, శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని తరించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు