సంపద కోసం క్షుద్రపూజలు.. ఇద్దరు మహిళల నరభలి..
జనం న్యూస్: కేరళలో అత్యంత క్రూరమైన హత్యలు జరిగాయి. సంపద పెరిగి ఐశ్వర్యవంతులు అవ్వాలంటే నరబలి ఇవ్వాలని చెప్పిన కొందరి మాటలు నమ్మి.. అమాయకులైన ఇద్దరి మహిళల ప్రాణాలను బలిగొన్నారు. గత నెలలోనే ఈ దారుణం జరిగినా.. తాజగా పోలీసు ఎంక్వైరీలో హత్య సూత్రధారి, మిగిలిన నిందితులు దొరికిపోయారు. బుధవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ఎర్నాకుళం కోర్టులో హాజరుపరచగా.. వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల మేరకు. కేరళలోని పథనంతిట్ట జిల్లా ఎలన్తూర్ గ్రామానికి చెందిన మహ్మద్ షఫి అలియాస్ రషీద్ (75) ఆయుర్వేద వైద్యం చేస్తుండటంతో పాటు మసాజ్ సెంటర్ కూడా నడుపుతుంటాడు. ఆయనకు మరో ఆయుర్వేద వైద్యుడు భగవాల్ సింగ్, ఆయన భార్య లైలా సహాయం చేస్తుంటారు. మహ్మద్ షఫి కేవలం వైద్యం మాత్రమే కాకుండా స్వామీజీగా కూడా ప్రచారం చేసుకున్నాడు. గతంలో అతడిపై రేప్ కేసు కూడా నమోదైంది. అయితే ఐశ్వర్యం, సంపద పెరగాలంటే శాస్త్రోక్తంగా నరబలి ఇవ్వాలని ఆయనకు కొందరు చెప్పారు. దీంతో అప్పటి నుంచి నరబలి ఇవ్వడానికి ఇద్దరు మహిళల కోసం వెతుకుతున్నాడు. ఎర్నాకుళంలో లాటరీ టికెట్లు విక్రయించే పద్మం (52) అనే మహిళలకు గత నెలలో మాయమాటలు చెప్పి ఎలన్తూర్‌కు తీసుకొని వచ్చాడు. అప్పటికే నరబలికి ఏర్పాట్లు చేసుకున్న ముగ్గరు కూడా సదరు మహిళను తాళ్లతో బంధించారు. పద్మంను షఫి కత్తితో వెనుక నుంచి పొడిచి చంపేశాడు. ఆ తర్వాత బాడీని ముక్కలుగా కోసి వాళ్ల ఇంటి ఆవరణలోనే అప్పటికే తవ్విన గోతుల్లో పూడ్చి పెట్టారు. కాగా, తన తల్లి కనపడం లేదని పద్మం కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసిన పోలీసులు షఫితో పాటు లైలా, భగవాల్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. పద్మంను చంపింది తామే అని, నరబలి ఇచ్చామని పోలీసులకు చెప్పారు. కాగా జూన్ నెలలో కూడా ఇలాగే రోస్లీ (49) అనే మహిళను కూడా అపహరించి నరబలి ఇచ్చామని వెల్లడించారు. రోస్లీ తలను లైలా నరికేసిందని.. ఆ తర్వాత షఫి ఆమె స్తనాలను కోసి పూజలు చేశాడని పోలీసులు చెప్పారు. నిందితులు చెప్తుంటే పోలీసులే భయపడ్డారని.. అంత ఘోరంగా రెండు హత్యలు చేశారని తెలుస్తున్నది. కాగా, ఈ ముగ్గురు నరబలి ఇచ్చిన తర్వాత నరమాంస భక్షణ కూడా చేశారనే వార్త వచ్చింది. అయితే పోలీసులు మాత్రం ఇంకా ఆ విషయాన్ని ధృవీకరించలేదు. ప్రస్తుతం ముగ్గురూ రిమాండ్‌లో ఉన్నారని.. త్వరలోనే పోలీస్ కస్టడీ కోరి మరిన్ని విషయాలు తెలుసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఈ నరబలి వార్త కేరళలో సంచలనం సృష్టించింది. మహ్మద్ షఫి గతంలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేసే వాడని, మహిళలకు జాబ్, డబ్బు ఆశ చూపించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడే వాడని స్థానికులు చెబుతున్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత స్వామీజీగా మారిపోయాడని, ఆయుర్వేద వైద్యం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడని అంటున్నారు. ఆయన వెంట ఉన్న లైలా రెండో భార్య అనే పుకార్లు కూడా ఉన్నాయి. కాగా, ఎలన్తూర్‌లో లైలా, భగవాల్ సింగ్‌కు మంచి పేరుంది. గ్రామంలో ప్రతీ ఒక్కరు వారిని గౌరవించేవాళ్లు. అయితే ఈ సంఘటన వారికి షాక్‌కు గురి చేసింది. ఇన్నాళ్లూ తాము గౌరవించిన వ్యక్తులు ఇలాంటి నరహంతకులా అని చర్చించుకుంటున్నారు.