గంజాయి కేసుల్లో పట్టుబడితే జీవితాలు అస్తవ్యస్తమే

గంజాయి కేసుల్లో పట్టుబడితే జీవితాలు అస్తవ్యస్తమే

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 30 సెప్టెంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

గంజాయి అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగానికి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ

యువత మేలుకోరి, చట్టాల తీవ్రతను తెలుపుతూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న జిల్లా పోలీసుశాఖ

ఎవరైనా గంజాయితో పట్టుబడితే ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన చట్టాలతో జీవితాలు నాశనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కావున, గంజాయి అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగం వంటి వాటికి యువత దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సెప్టెంబరు 29న పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - ప్రస్తుతం గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతూ, చట్టాలను కూడా కఠినతరం చేసారన్న విషయాన్ని యువత గుర్తించాలన్నారు. చట్టాలు ఎంత కఠినంగా మారాయంటే హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్షను న్యాయస్థానాలు విధిస్తే, సదరు వ్యక్తి 12సం.లు జైలు జీవితం తరువాత విడుదలవుతారన్నారు. అదే విధంగా ఒక వ్యక్తి గంజాయి అక్రమ రవాణకు పాల్పడి, పోలీసులకు పట్టుబడి, నేరం రుజువైతే సదరు వ్యక్తికి 20సం.లు వరకు శిక్ష విధించబడుతుందన్నారు. అంటే గంజాయి అక్రమ రవాణకు పాల్పడడం అన్నది ఎంత తీవ్రతరమైన నేరమన్న విషయాన్ని యువత గుర్తించాలన్నారు. గంజాయి కేసుల్లో ఎక్కువగా యువతే పట్టుబడుతూ, జైళ్ళలో మగ్గుతున్నారన్నారు. గంజాయి కేసుల్లో న్యాయస్థానాలు కూడా వెంటనే బెయిలు మంజూరు చేసే పరిస్థితులు లేవన్నారు. యువత చెడు వ్యసనాలకు, స్నేహాలకు అలవాటుపడి, వారి అవసరాలను తీర్చుకొనేందుకు అక్రమదారుల్లో ప్రయాణిస్తూ, జైలు పాలవుతున్నారన్నారు.

తమిళనాడు రాష్ట్రం మధురై, భారతీనగర్ కు చెందిన ఆర్.శివకుమార్ (28 సం.లు) ఐటిఐ చదివి, చెడు వ్యసనాలకు అలవాటుపడి, అదే ప్రాంతానికి చెందిన మరో స్నేహితుడు బీఎస్సీ చదువుతున్న ఆర్. మనికందన్ (23 సం.లు)తో కలిసి మధురై నుండి అరకు వచ్చి, అక్కడ గుర్తు తెలియని వ్యక్తి నుండి రూ. 5000/-లకు రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి, తిరిగి మధురై వెళ్ళుతూ, ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలోని బొడ్డవర చెక్ పోస్టు వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డారని జిల్లా ఎస్పీ తెలిపారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించి, ఇరువురిని అరెస్టు చేసి, వారి వద్ద పట్టుబడిన గంజాయిని సీజ్ చేసి, నిందితులను రిమాండుకు తరలించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

అదే విధంగా కేరళ రాష్ట్రం అలిప్పీ జిల్లా పాతివూర్కు చెందిన విను మోహన్ (30 సం.లు), ప్రసన్న జయన్ ఐశ్వర్య (23 సం.లు) అనే యువతితో కలిసి అరకు వచ్చి, అక్కడ సుమారు 10కిలోల గంజాయిని కొనుగోలు చేసి, తిరిగి కేరళ వెళ్ళుచూ కొత్తవలస ఆర్టీసి కాంప్లెక్సు సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతూ కొత్తవలస పోలీసులకు పట్టుబడ్డారని జిల్లా ఎస్పీ తెలిపారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించి, వారి వద్ద నుండి సుమారు 10కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితులు ఇద్దరిని రిమాండుకు తరలించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్

తెలిపారు.

కావున, యువత తమ చెడు అలవాట్లుకు స్వస్తి పలికి, ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకొని, సాధించేందుకు కృషి చెయ్యాలన్నారు. గంజాయి వ్యాపారుల ప్రలోభాలకు లొంగొద్దని, గంజాయి అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కోరారు.