ట్రాన్స్ఫార్మర్ లలో కాపర్ వైర్ దొంగతనం చేస్తున్న దొంగల అరెస్ట్
జనం న్యూస్ అక్టోబర్ 22 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్
కాపర్ వైర్ ను దొంగతనం చేస్తున్న ఐదుగురు నిందితులను మునగాల పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మునగాల మండలం గ్రామ శివారులో నాగార్జునసాగర్ ఎడమ కాలువ పై గల ఆర్-9 లిఫ్ట్ కలకోవా రైతు రక్షణ కమిటీ ఎత్తిపోతల పథకం లిఫ్టుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ నందు కాపర్ వైరు దొంగతనం చేసినట్లు లిఫ్ట్ అధికారులు, చైర్మన్ జనవరి నెలలో మునగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా మంగళవారం ఉదయం మునగాల ఎస్ ఐ తన సిబ్బందితో కలిసి జాతీయ రహదారి మొద్దుల చెరువు స్టేజి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై వస్తున్న ఐదుగురు వ్యక్తులను అనుమానించి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపారు. వీరిని విచారించగా ఐదుగురు నల్లగొండ జిల్లా నిడమనూరు మండలానికి చెందిన ముప్పారం గ్రామానికి చెందిన కొంచెం కోటేష్, రూపాని గోపి, రూపాని నాగయ్య, వరికోప్పల శ్రీను,కొంచెం విజయ్ ,వ్యక్తులుగా గుర్తించినట్లు తెలిపారు. వీరు అయిదుగురు నల్లగొండ ,సూర్యపేట జిల్లాలలోని కాలవలపై వేసిన ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకొని రెక్కి నిర్వహించి కాపర్ వైరును దొంగతనం చేస్తున్నట్లుగా విచారణలో గుర్తించినట్లుగా తెలిపారు. వీరిపై మునగాల, నడిగూడెం ,పెనపహాడ్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదైనట్లుగా తెలిపారు. నిందితులపై గతంలో ఇదే రకమైన కేసులు మిర్యాలగూడెం, వేములపల్లి ,నేలకొండపల్లి, త్రిపురవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం ఐదు కేసులలో నిందితులుగా ఉన్నట్లుగా తెలిపారు. అదుపులోకి తీసుకొని నిందితుల వద్ద నుండి మూడు లక్షల అరవై వేల రూపాయల విలువగల రెండు క్వింటాల 20 కేజీల కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించి రివార్డ్ అందించారు. కార్యక్రమంలో మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.