తెలంగాణలో ఘోరం.. పిల్లలు ఎత్తుక పోయే వాడు అనుకొని రాళ్ళతో కొట్టి చంపారు.. తీరా చూస్తే.. పాపం

తెలంగాణలో ఘోరం.. పిల్లలు ఎత్తుక పోయే వాడు అనుకొని రాళ్ళతో కొట్టి చంపారు.. తీరా చూస్తే.. పాపం

జనం న్యూస్: బక్క పలచటి వ్యక్తి.. అనారోగ్యంతో బాధపడుతూ శరీరం సహకరించని స్థితిలో ఉన్నాడు. స్థిరంగా కాసేపు నిల్చోనూలేడు.. చిన్నగా నెడితే పడిపోయేంతగా.. ఒక్క మాటలో చెప్పాలంటే అస్థిపంజరానికి ప్రాణం ఉన్నట్లుగా ఉన్నాడు. అతడిని చూసిన స్థానికులు.. చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేయడానికొచ్చాడనుకొని అనుమానించారు. చుట్టూ గుమిగూడి కర్రలతో కొట్టడంతో ప్రాణాలు విడిచాడు. ఈ అమానవీయ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణంలోని గాయత్రి నగర్‌లో సోమవారం ఉదయం 8 గంటలకు ఓ వ్యక్తి గల్లీలో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించి స్థానికులు అతడిని పరిపరి విధాలుగా స్పందించారు. అతడు ఒక్క మాటా మాట్లాడకపోవడానికి తోడు లంగా, రవికతో చిత్రమైన ఆహార్యంతో, ముఖం కనిపించకుండా దస్తీ కట్టుకోవడంతో అనుమానించారు. ఇటీవల చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న ప్రచారం స్థానికంగా విస్తృతంగా సాగుతుండటంతో ఆ వ్యక్తిని కిడ్నాపర్‌గా భావించారు. అది పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయం కావడంతో గుమిగూడిన వారిలో బడి ఈడు పిల్లల తల్లిదండ్రులే ఎక్కువగా ఉన్నారు. వారిలోనే కొందరు ఆ వ్యక్తిని కర్రలతో ఇష్టంవచ్చినట్లుగా కొట్టారు. సమాచారం అందుకున్న నాలుగో టౌన్‌ పోలీసులొచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. తీవ్రగాయాలు కావడం, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో పోలీసులు అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు నిజామాబాద్‌ రూరల్‌ పరిధిలోని ఖానాపూర్‌కు చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. అతడు ఓ అనాథ అని, ఎప్పడూ మహిళా వేషధారణలోనే ఉంటాడని స్థానికులు తెలిపారు. నిజామాబాద్‌ కొచ్చి భిక్షాటన చేస్తూ పొట్ట నింపుకుంటున్నాడని ఖానాపూర్‌వాసులు తెలిపారు. ఓ అమాయక వ్యక్తిని అనుమానించి తీవ్రంగా కొట్టి ప్రాణాలు తీశారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను స్థానికులు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. వీడియోలు, ఫొటోల ఆధారంగా ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు నగర నాలుగో టౌన్‌ పోలీసులు తెలిపారు.