ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
జనం న్యూస్ 09 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా : వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు. మంగళవారం అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని సిబ్బంది హాజరు పుస్తకాన్ని తనిఖీ చేసి సిబ్బంది ఎప్పటికప్పుడు ఆసుపత్రికి సమయానికి హాజరై, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులకు ఆదేశించారు. ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ ,ఇన్ పేషెంట్ వివరాలను కంప్యూటర్ ద్వారా పరిశీలించి, వివరాలను ఆన్ లైన్ లో సక్రమంగా నమోదు చేయాలని అన్నారు. ఫార్మసీలో అందుబాటులో ఉన్న అన్ని మందులు సక్రమంగా, ఉంచుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి మందుపై స్పష్టమైన పేర్లతో లేబుల్స్ ఉండాలని, మందులను వర్గీకరించి, గందరగోళం లేకుండా చక్కగా అమర్చాలని సూచించారు. అలాగే, ఫార్మసీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం శుభ్రత పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్స్‌రే, ఈసీజీ, డయాలసిస్ యూనిట్లను కూడా పరిశీలించి, పరికరాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు తీసుకోవలసిన చర్యలు మరియు రోగులకు ల్యాబ్ టెస్టులు త్వరగా పూర్తి చేసి రిపోర్టులు సమయానికి అందించాలని అన్నారు. బ్లడ్ స్టోరేజ్ యూనిట్‌ను పరిశీలించి, ఎల్లప్పుడూ అవసరమైన రక్తం నిల్వ ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సరస్వతి, డాక్టర్స్ లక్ష్మమ్మ, ఫణీంద్ర ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.