ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు భేష్-మరింత మెరుగైన సేవలకు సహకారం అందిస్తాం
వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వి.కరుణ
జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా,నవంబర్ 12 (రిపోర్టర్ ప్రభాకర్): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు భేషుగ్గా ఉందని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి.కరుణ తెలిపారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంసీహెచ్, ట్రైబల్ సెల్ నందు రోగుల వివరాలను నమోదు ప్రక్రియను పరిశీలించి రిఫరల్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి కేసులు లేకపోవడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ట్రైఏజ్, హెచ్డీయు, లేబర్, ఎంఓటీ, ఆపరేషన్ థియేటర్,సర్జికల్,పిడియాట్రిక్,న్యూబోర్న్,కంగారు మాతృ సంరక్షణ యూనిట్లను సందర్శించి పరిశీలించారు. పసిపాపను ఎత్తుకొని, ఆసుపత్రిలో అందుతున్న వసతులపై బాలింతలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి జిల్లా బాలల సంరక్షణ చికిత్స కేంద్రాన్ని సందర్శించి, అక్కడ వివిధ విభాగాలను తనిఖీ చేశారు. వివిధ లోపాలు గల చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలను తిలకించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలు బాగున్నాయని, ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఆమె వైద్యులను కోరారు.ఇందుకు ప్రభుత్వపరంగా అందించాల్సిన పరికరాలు, సదుపాయాలు, వసతుల కల్పనకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.జిల్లాలో రక్తహీనతతో హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మాతా, శిశు మరణాలు లేకుండా వైద్యులు చూడాలని తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కె.విజయపార్వతీ, వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డా. ఎం.వినోద్, ఏరియా, బాలల సత్వర చికిత్స ఆసుపత్రుల మెడికల్ ఆఫీసర్లు,వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.